రాజ్యసభ బరిలో నితీష్‌ తనయుడు నిశాంత్? | Bihar CM Nitish Kumar's son Nishant nominee from Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభ బరిలో నితీష్‌ తనయుడు నిశాంత్?

Mar 3 2026 1:40 PM | Updated on Mar 3 2026 1:46 PM

Bihar CM Nitish Kumar's son Nishant nominee from Rajya Sabha

పట్నా: బిహార్ రాజకీయ ముఖచిత్రంలో మరో కీలక మలుపు  చోటుచేసుకోనుంది. ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జేడీయూ తరఫున ఆయనను రాజ్యసభకు పంపేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది.

నిశాంత్ రాజకీయ రంగ ప్రవేశాన్ని జేడీయూ సీనియర్ నేత శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని, రాబోయే ఒకటి రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన పేర్కొన్నారు. హోలీ పండుగకు ముందే ఈ నిర్ణయం వెలువడటంతో పార్టీ శ్రేణులు, మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత కొన్నేళ్లుగా నిశాంత్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని పార్టీ కార్యకర్తలు నిరంతరం కోరుతున్న తరుణంలో, ఈ ప్రతిపాదనకు కార్యరూపం లభించింది.

నిశాంత్ కుమార్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అది రాజ్యసభ సభ్యత్వం కూడా కావచ్చని మంత్రి శ్రవణ్ కుమార్ పరోక్షంగా తెలియజేశారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించినప్పటి నుండి నిశాంత్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సమక్షంలోనే నిశాంత్ ప్రవేశంపై చర్చ జరగగా, సరైన సమయం కోసం నిరీక్షించినట్లు తెలుస్తోంది. జేడీయూ మనుగడకు, పార్టీ పటిష్టతకు నితీష్ వారసుడు రావడం అనివార్యమని అటు విపక్ష నేతలు సైతం గతంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఈ పరిణామం బిహార్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది.
 

ఇది కూడా చదవండి: మాజీ కేంద్ర మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత

Advertisement
 
Advertisement
Advertisement