ఇస్లామాబాద్: సరిహద్దు వివాదంతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్-పాకిస్తాన్‌ల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. తాలిబన్ దళాలు అంతర్జాతీయ సరిహద్దు అయిన ‘డ్యూరాండ్ లైన్’ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి, భీకర దాడులకు తెగబడ్డాయి. ఈ ఆకస్మిక దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఎనిమిది కీలక సైనిక అవుట్‌పోస్టులను అఫ్గాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అఫ్గాన్ డిప్యూటీ ప్రతినిధి సెదిఖుల్లా నుస్రత్ వెల్లడించిన వివరాల ప్రకారం కందహార్ ప్రావిన్స్‌లో ఐదు, ఖోస్ట్‌లో రెండు, జబుల్ ప్రావిన్స్‌లో ఒక సైనిక పోస్టును అఫ్గాన్ దళాలు హస్తగతం చేసుకున్నాయి. ముఖ్యంగా స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో సరిహద్దు దాటిన అఫ్గాన్ సైనికులు మూడు పాక్ పోస్టులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ముగ్గురు పాక్ సైనికులను హతమార్చి, మరొకరిని సజీవంగా బందీగా పట్టుకున్నారు. వాయుసేన రంగంలోనూ పాకిస్తాన్‌కు చుక్కెదురైంది. సోమవారం ఒక్క రోజే అఫ్గాన్ దళాలు పాక్‌కు చెందిన నాలుగు డ్రోన్లను కూల్చివేశాయి.
జబుల్ ప్రావిన్స్‌లోని షాముల్జాయ్ జిల్లాలో లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ఒక డ్రోన్‌ను అఫ్గాన్ సైన్యం నేలకూల్చగా, కందహార్ పరిసరాల్లో మరో డ్రోన్ కుప్పకూలింది. కాబూల్‌తో పాటు అఫ్గాన్ లోని ఇతర ప్రాంతాలపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలు చేపట్టినట్లు తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అఫ్గాన్ వైమానిక దళం పాకిస్తాన్‌లోని రావల్పిండి, క్వెట్టా, ఖైబర్ పఖ్తున్ఖ్వా తదితర కీలక ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది.
ఈ దాడుల్లో పాక్ సైనిక వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పక్తికా ప్రావిన్స్‌లోని అంగూర్ ఆదా బేస్ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక సాయుధ ట్యాంకును అఫ్గాన్ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. అఫ్గాన్ ప్రారంభించిన ఈ ఎదురుదాడిలో ఇప్పటివరకు 100 మందికి పైగా పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, 30కి పైగా చెక్‌పోస్టులు అఫ్గాన్ వశమయ్యాయని సమాచారం. ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుల్లో కాల్పుల మోత కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇది కూడా చదవండి: ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా


