పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు? | what Iran Strategy Weakness or Calculated Move Middle East War Clouds | Sakshi
Sakshi News home page

పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు?

Mar 3 2026 11:21 AM | Updated on Mar 3 2026 11:32 AM

what Iran Strategy Weakness or Calculated Move Middle East War Clouds

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచమంతా ఇరాన్ తీరును నిశితంగా పరిశీలిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్.. తన క్షిపణులను నేరుగా వారిపై ప్రయోగించాల్సింది పోయి, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాల వైపు మళ్లించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇది ఇరాన్ బలహీనతా? లేక వ్యూహాత్మక చర్యలో భాగంగా వేస్తున్న ఒక ఎత్తగడా? అసలు పొరుగు దేశాలే ఇరాన్ టార్గెట్‌గా ఎందుకు అయ్యాయి? అనే అంశాలు చూద్దాం.

మిత్రదేశాల ముసుగులో శత్రు స్థావరాలు

ఇరాన్ తన క్షిపణులను ఇరుగుపొరుగు దేశాల వైపు మళ్లించడానికి ప్రధాన కారణం.. ఆయా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు. బహ్రెయిన్, కతార్, కువైట్‌.. వంటి ప్రాంతాల్లో అమెరికాకు చెందిన భారీ నౌకాదళ, వైమానిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడుల్లో ఈ స్థావరాలే వేదికలయ్యాయి. దాంతో నేరుగా వాషింగ్టన్‌పై దాడి చేయలేని ఇరాన్, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్‌లను లక్ష్యంగా చేసుకుంది.

ప్రాంతీయ ఆధిపత్యం

గతంలో ఇరాన్ తన పరోక్ష యుద్ధాన్ని (ప్రాక్సీ వార్‌) హమాస్, హిజ్బుల్లా ద్వారా నడిపించేది. కానీ 2024-25 మధ్య జరిగిన పరిణామాల్లో ఇజ్రాయెల్ ఈ గ్రూపులను తీవ్రంగా దెబ్బతీసింది. సిరియాలో అస్సాద్ ప్రభుత్వం కూలిపోవడం, హిజ్బుల్లా నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడంతో ఇరాన్ కొంత బలహీనపడింది. దీంతో తన ఉనికిని చాటుకోవడానికి పొరుగున ఉన్న ఇజ్రాయెల్ అనుకూల దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.

ఇంధన మార్కెట్ అతలాకుతలం

యుద్ధం కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా తట్టుకోవడం కష్టం. అందుకే, గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందని అభిప్రాయాలున్నాయి.

హోర్ముజ్ జలసంధి మూసివేత: ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ ప్లాన్. పొరుగు దేశాలపై దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే తమ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయనే హెచ్చరికను ఇరాన్ పంపాలని చూస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.

అంతర్గత అశాంతి నుంచి దృష్టి మళ్లింపు

2026 జనవరి నుంచి ఇరాన్ తీవ్రమైన దేశీయ నిరసనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బయటి దేశాలపై దాడులు చేయడం ద్వారా జాతీయవాదాన్ని రగిల్చి ప్రజల దృష్టిని అంతర్గత సమస్యల నుంచి మళ్లించాలని ఇరాన్ పాలకులు చూస్తున్నారు.

అధికార మార్పు భయం

ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌లో పాలన మార్పును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న దాడులు కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాదు, కీలక నాయకత్వంపై కూడా జరుగుతున్నాయి. తమ మనుగడకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఒక గాయపడిన సింహంలా ఇరాన్ తన పక్కనున్న చిన్న దేశాలపై విరుచుకుపడుతోంది. ఇది అమెరికాను చర్చల వైపు మళ్లించే ప్రయత్నం కూడా కావచ్చని కొందరి అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement