ఇరాన్ సంక్షోభం.. ఎగుమతులు, దిగుమతులపై నీలినీడలు! | West Asia Tensions Cloud India Edible Oil Sector Amid Iran-Israel Strikes | Sakshi
Sakshi News home page

ఎగుమతులు, దిగుమతులపై నీలినీడలు!

Mar 3 2026 9:51 AM | Updated on Mar 3 2026 10:14 AM

West Asia Tensions Cloud India Edible Oil Sector Amid Iran-Israel Strikes

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటనూనెల విభాగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి, అటు నూనె గింజల దిగుమతులపై.. ఇటు ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.

భారతదేశం తన వంటనూనె అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్; అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ ఆయిల్; రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ భారత్‌కు వస్తుంటాయి. అయితే, ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి, సూయజ్ కాలువ గుండానే సాగుతాయి.

ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే, ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే రవాణా, బీమా ఖర్చులు పెరిగి అది దేశీయంగా వినియోగదారుడిపై భారం మోపుతుందని అంచనా వేస్తున్నారు.

ఎగుమతులపై దెబ్బ

కేవలం దిగుమతులే కాకుండా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఆయిల్ మీల్స్(నూనె గింజల నుంచి నూనెను తీసేసిన తర్వాత మిగిలే ఉప ఉత్పత్తి ) ఎగుమతులు కూడా ప్రతిష్టంభనను ఎదుర్కోవచ్చు. భారత ఆయిల్ మీల్స్ ఎగుమతుల్లో ఆగ్నేయాసియా వాటా 65% కాగా, పశ్చిమాసియా (గల్ఫ్) 20%, యూరప్ 15% వాటాను కలిగి ఉన్నాయి. యుద్ధం ముదిరితే గల్ఫ్, యూరప్ దేశాలకు జరిగే ఎగుమతుల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది.

క్రూడాయిల్ ధరల పెరుగుదల కేవలం రవాణా ఖర్చులనే కాకుండా గ్లోబల్ బయోఫ్యూయల్ మార్కెట్ ద్వారా వంటనూనెల ధరలను కూడా ప్రభావితం చేస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులు కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతాయని అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement