Hyderabad: ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి! | West Asia war impact on Hyderabad passengers stuck in Dubai Doha Abu Dhabi transit Hyderabad news | Sakshi
Sakshi News home page

Hyderabad: ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి!

Mar 2 2026 7:37 AM | Updated on Mar 2 2026 7:37 AM

West Asia war impact on Hyderabad passengers stuck in Dubai Doha Abu Dhabi transit Hyderabad news

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం హైదరాబాద్‌ వాసులపై పడుతోంది. అనేకమంది ప్రయాణికులు, యాత్రికులు విదేశాల్లో చిక్కుకుపోయారు. గగనతలాలను (ఎయిర్‌స్పేస్‌) మూసివేయడంతో పాటు ఎయిర్‌పోర్టులను ఖాళీ చేయిస్తుండడంతో పెద్ద ఎత్తున నగరవాసులు ఆయా దేశాల్లో ఇక్కట్లు పడుతున్నారు. ట్రాన్సిట్‌ వీసాలు తీసుకోవడానికీ అవకాశం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అక్కడి ఎంబసీ కార్యాలయాలకు ఫోన్లు చేసినా స్పందన ఉండట్లేదని నగరంలో ఉన్న వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

ఆదివారం నుంచి ఆయా దేశాల్లోని అన్ని విమానాశ్రయాలు మూతపడడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అమెరికా, యూకేతో పాటు యూరోప్‌ దేశాలకు ప్రయాణించే వారు విమాన టిక్కెట్లు నేరుగా తమ గమ్యస్థానానికే తీసుకున్నా... అలా ప్రయాణించడం సాధ్యం కాదు. సింగపూర్‌తో పాటు దుబాయ్, దోహా, అబుదాబి తదితర ప్రాంతాల్లో కొన్ని గంటలు ఆగి ముందుకుసాగాల్సిందే. వీటినే ట్రాన్సిట్‌ పాయింట్స్‌ అంటారు. శనివారం నగరం నుంచి వెళ్లినవారు ట్రాన్సిట్‌ పాయింట్స్‌లో చిక్కుకుపోయారు. హఠాత్తుగా కమ్మేసిన యుద్ధ మేఘాలు, ఎయిర్‌ స్పేస్‌లు మూసేయడం, వందల అంతర్జాతీయ సరీ్వసుల రద్దు, ప్రయాణికుల లగేజీ దించేయడంతో దుబాయ్, అబుదాబి, దోహా తదితర విమానాశ్రయాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి లగేజీ కుప్పలు కనిపిస్తున్నాయి.

హోటల్స్‌లోనూ బసకు అవకాశం లేక... 
ప్రయాణం మధ్యలో, ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో ఆయా దేశాల్లో కొన్ని రోజులు ఉండాలంటే కచి్చతంగా ట్రాన్సిట్‌ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టుల్లో ఉండే ఈ వీసా కౌంటర్లు సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉంటాయి. ఇక యుద్ధ వాతావరణంలో శనివారం వీటి వద్ద భారీగా క్యూలు పెరిగిపోయాయి. దీంతో అందరికీ ఈ వీసాలు లభించట్లేదు. మరోపక్క విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో శనివారం రాత్రికే ప్రయాణికులను విమానాశ్రయం బయటకు పంపేశారు. సాధారణంగా విమానయాన సంస్థలకు హోటల్స్‌కు మ«ధ్య ఒప్పందాలు ఉంటాయి. అనివార్య పరిస్థితుల్లో   ప్రయాణికులను ఎయిర్‌లైన్స్‌లు ఒప్పందం ఉన్న హోటల్స్‌కు పంపి బస కల్పిస్తాయి. శనివారం రాత్రి   ఓచర్లు ఇచ్చి ఇలానే చేశాయి. అప్పటికే హోటళ్లు ఖాళీ లేకపోవడం, ఆహారం, నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో యాజమాన్యాలు గదులు ఇవ్వడం లేదు.

విహారయాత్రికులది మరో పరిస్థితి... 
ఆయా ట్రాన్సిట్‌ కంట్రీస్‌కు టూరిస్టులు సైతం ఎక్కువ సంఖ్యలోనే వెళ్తుంటారు. సాధారణంగా 4నుంచి 15 రోజుల ప్యాకేజీలతో వెళ్లి వస్తుంటారు. ఇందులోనే రాను–పోను చార్జీలు, బస, స్థానికంగా రవాణా తదితరాలు  ఉంటాయి. నగరం నుంచి గత వారం రోజుల్లో దుబాయ్‌ సహా ఇతర ప్రాంతాలకు టూరిస్టులుగా వెళ్లినవాళ్లు  హోటళ్లలో ఇరుక్కుపోయారు. ఇలాంటివారిలో పీవీ సింధు, మంచు విష్ణు వంటి సెలబ్రిటీలు సైతం ఉన్నారు. వీరికి ఇబ్బంది లేకపోయినా సాధారణ టూరిస్టులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్యాకేజీ సమయం మీరిన తర్వాత, కొన్ని హోటళ్లలో సమయం ఉన్నప్పటికీ బస చేయడానికి యాజమాన్యాలు అంగీకరించట్లేదు. తాము వసతులు కలి్పంచలేమని, ఆహారం అందించలేమని యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కొన్ని హోటల్స్‌లో బస కలి్పంచడానికి భారీ మొత్తం డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలిసిన వారు ఎవరూ లేకుంటే ఇబ్బందే 
గత నెల 22న విహార యాత్ర నిమిత్తం దుబాయ్‌ వచ్చా. తాజా ఉద్రిక్తతలతో శనివారం నుంచి హోటల్‌ రూమ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. ఇక్కడ వాట్సాప్‌ కూడా పని చేయకపోవడంతో కుటుంబీకులతో సంప్రదింపులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడికక్కడ క్షిపణులు, పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో తెలియట్లేదు. స్థానికంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నవారికి ఇబ్బంది లేదు. టూరిస్టు, ప్యాసింజర్‌గా వచి్చనవాళ్లు మాత్రం ఇబ్బంది పడాల్సిందే. భయానక పరిస్థితుల మధ్య క్షణమొక యుగంగా గడుపుతున్నాం. అబుదాబి, దోహాల్లోనూ ఇలానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి విమానాశ్రయాలు మూసివేశారు. 
–వినయ్‌ కుమార్, మియాపూర్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement