ఇదండీ మీ ర్యాంకు... వచ్చేయండి! | Private Engineering Colleges Business Starts | Sakshi
Sakshi News home page

ఇదండీ మీ ర్యాంకు... వచ్చేయండి!

Mar 2 2026 4:28 AM | Updated on Mar 2 2026 4:28 AM

Private Engineering Colleges Business Starts

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ర్యాంకుల మేళా 

ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న వైనం 

సీటు ముందే రిజర్వు చేసుకోవాలని ఒత్తిడి 

ఇంటర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో ఒప్పందాలు 

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల వ్యాపారం షురూ

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎప్‌సెట్‌) మే నెలలో జరుగుతుంది. కానీ ప్రైవే­టు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇప్పుడే విద్యార్థులకు ర్యాంకులు ఇస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రైవే­టు, ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీలతో ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు సమన్వయం చేసుకుంటున్నాయి. థర్డ్‌ పార్టీ ఏజెన్సీల ద్వారా ఆన్‌లైన్‌ ఎప్‌సెట్‌ మాదిరి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగానే ర్యాంకులు తెలియజేస్తున్నాయి. వీటిని చూపించి, తమ కాలేజీలో ముందే సీటు రి­జ­ర్వు చేసుకోవాలని కోరుతున్నాయి.

ఇంటర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ కూడా దీనికి సహకరిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఎప్‌సెట్‌ రాసిన వెంటనే కంప్యూటర్‌ తెరపై చివరలో మార్కులను వెల్లడించే విధానాన్ని సెట్‌ విభాగం తీసుకొచి్చంది. కాబట్టి విద్యార్థికి ఎంత ర్యాంకు వస్తుందనే అంచనాకు రావడం తేలి­క. ఫలితంగా ఏ ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటుకు యత్నించాలో విద్యార్థి ఓ నిర్ణయానికి వచ్చే వీలుంది. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేటు కాలేజీలు తమకు అనుకూలంగా ర్యాంకులు తెస్తున్నాయనే ఆరోపణలు కూడా విని్పస్తున్నాయి. ముందుగా సీటు రిజర్వు చేసుకుంటే గ్యారంటీ ఉంటుందని నమ్మబలుకుతున్నాయి.   

లక్ష మందికి గాలం 
ఏటా 3 లక్షల మంది ఎప్‌సెట్‌ రాస్తుంటారు. 160 మా­ర్కులకు ఉండే ఈ ప్రశ్నపత్రంలో సగం మా­ర్కు­లు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. 50 లోపు మార్కులతో 50 వేల ర్యాంకు పొందుతు­న్న వారు ఎక్కువగా ఉంటున్నారు. 43 మార్కులు సాధించి లక్ష లోపు ర్యాంకు వస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వందకు పైగా మార్కులు సాధిస్తే వారికి వంద ర్యాంకు వస్తుంది.

ఇలాంటి వాళ్లంతా ఎన్‌ఐటీ, ఐఐటీలు ఇతర సంస్థల్లో సీట్లు పొందుతున్నారు. వెయ్యి లోపు ర్యాంకు వచ్చే విద్యార్థులకు కన్వీనర్‌ కోటాలోనే టాప్‌ కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి. 5 వేలలోపు ర్యాంకు వచ్చే దాదాపు 10 వేల మందికి కూడా ఆఖరి దశ కౌన్సెలింగ్‌ వరకూ టాప్‌ టెన్‌లో ఉన్న కాలేజీల్లో సీట్లు దొరుకుతున్నాయి. ఈ లెక్కన మంచి కాలేజీలో సీట్లు రావనుకున్న లక్ష మందిని ప్రైవేటు కాలేజీలు గుర్తించి, సీట్లు అమ్ముకునే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి.   

కాలేజీల కొత్త మంత్రం 
ఇంజనీరింగ్‌ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్‌ కొలువు గ్యా­రంటీ అన్న నినాదాన్ని విద్యార్థుల వద్దకు తీసుకెళ్తున్నాయి. డీమ్డ్, అటానమస్‌ కాలేజీలు ఇప్పటికే కొన్ని కోచింగ్‌ సెంటర్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. కేవలం నైపుణ్యం నేర్పడం ద్వారా ఉద్యోగాలు సాధించ­డం తేలికని భావిస్తున్నాయి. ఫీల్డ్‌వర్క్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో దీన్ని తమకు అనుకూలంగా కాలేజీలు మలుచుకుంటున్నాయి.

కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలతో తమకు భాగస్వామ్యం ఉందని, వాటిల్లో ఇంటర్న్‌ షిప్‌ ఇప్పిస్తామని, అదే కంపెనీల్లో ఉపా­ధి లభించే అవకాశం ఉందని చెబుతున్నా­యి.  ప్రైవేటు కాలేజీలు ప్ర­ధా­నంగా కంప్యూటర్‌ సైన్స్, ఇతర ఎమర్జింగ్‌ కోర్సుల సీట్ల భర్తీకే ప్రయతి్నస్తున్నాయి. దీనికోసం ఇప్పట్నుంచే కృత్రిమ డిమాండ్‌ సృష్టించే ప్రయత్నంలో ఉన్నాయి.   

ర్యాంకు ఏదైనా దారి అటే... 
రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. వీటిల్లో 68 శా­తం కంప్యూటర్, దాని అనుబంధ ఎమర్జింగ్‌ కోర్సుల్లోనే సీ­ట్లున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటాలో దాదాపు 40 వేల సీట్లు­న్నాయి. ఇందులో 25 వేల వరకూ కంప్యూటర్‌ కోర్సుల్లోని సీట్లే భర్తీ అవుతున్నాయి. 20 వేల మంది విద్యార్థులు 50 వేలకుపైగా ర్యాంకు ఉన్నవాళ్లే ఈ కోర్సుల్లో చేరుతున్నారు. దీంతో కంప్యూటర్‌ కోర్సుల్లో నాణ్యత లేని విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఇటీవల ఏఐసీటీఈ పేర్కొంది. ఆన్‌లైన్‌ విధానం తేవడం వల్ల నాణ్యమైన విద్యార్థులు వచ్చే వీలుందని ఏఐసీటీఈ భావిస్తోంది. ఎమర్జింగ్‌ కోర్సుల్లో డబ్బులు కట్టి చేరడం వల్ల ఏఐతో వచ్చే ఉద్యోగాల్లో కోడింగ్‌ చేయలేకపోతున్నారని నౌకరీ డాట్‌ కామ్‌ నివేదిక స్పష్టం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement