తప్పతాగి.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టి | Drunk Driver Drags Traffic Constable On Car Bonnet at Gachibowli | Sakshi
Sakshi News home page

తప్పతాగి.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టి

Mar 2 2026 7:19 AM | Updated on Mar 2 2026 12:24 PM

Drunk Driver Drags Traffic Constable On Car Bonnet at Gachibowli

మద్యం మత్తులో యువకుడి ర్యాష్‌ డ్రైవింగ్‌ 

బానెట్‌పై కానిస్టేబుల్‌ ఉన్నా కారు ఆపకుండా వెళ్లిన వైనం  

రంగారెడ్డి జిల్లా: మద్యం మత్తులో కారులో అతి వేగంగా వచ్చిన ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. తన కారుతో మరో కారును ఢీకొట్టి పారిపోయే ప్రయత్నంలో ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను కూడా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ కారు బానెట్‌పై పడ్డా ఆపకుండా దాదాపు 800 మీటర్లు దూసుకెళ్లాడు. వాహనదారులు అతడిని అడ్డుకోవడంతో పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

నార్సింగిలోని జయభేరి సమ్మిట్‌లో నివాసం ఉండే గుర్రంపాటి తరుణ్‌రెడ్డి బెంజ్‌ కారులో వెళుతూ శనివారం ఉదయం నానక్‌రాంగూడ వద్ద మరో కారును ఢీ కొట్టాడు. అయితే అతను ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు సెట్‌లో సమాచారం అందించడంతో ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న గచ్చిబౌలి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఇ.నర్సింహులు అటుగా వచ్చిన బెంజ్‌ కారును ఆపేందుకు ప్రయతి్నంచారు. 

అయితే తరుణ్‌ రెడ్డి దీనిని పట్టించుకోకుండా కానిస్టేబుల్‌ను ఢీకొనడంతో అతను కారు బానెట్‌పై పడ్డాడు. అయినా కారు ఆపకుండా అలాగే వెళుతుండటాన్ని గుర్తించిన వాహనదారులు కారును అడ్డుకుని కానిస్టేబుల్‌ను కాపాడారు. ఈ ఘటనలో నర్సింహులు స్వల్పగాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా 160 ఎంజీగా నమోదైంది. ఈ మేరకు పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement