ఆర్టీసీ ప్రయాణం చల్లచల్లన.. | TGSRTC offers significant rebates on AC and Super Luxury bus travel in Telangana | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రయాణం చల్లచల్లన..

Mar 2 2026 6:20 AM | Updated on Mar 2 2026 6:22 AM

TGSRTC offers significant rebates on AC and Super Luxury bus travel in Telangana

ఏసీ, సూపర్‌లగ్జరీ చార్జీలపైన రాయితీ  

సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల ఆదరణను పెంచుకొనేందుకు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌  ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ప్రతిరోజు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండగా, ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు, మెట్రో డీలక్స్‌లు మాత్రం  60 – 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కొన్ని మార్గాల్లో ప్రయాణికుల ఆదరణకు నోచుకోవడం లేదు. ఈ బస్సుల్లో కేవలం నగదు చెల్లించి టికెట్‌ కొనుక్కొనే సదుపాయం ఉండటంతో మహిళలు వినియోగించుకోవడం లేదు. మరోవైపు అధిక చార్జీల కారణంగా పురుషులు సైతం మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సేవలను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు.

హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠీ, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలకు ఏసీ బస్సులు నడుస్తున్నప్పటికీ  ఆశించిన స్థాయిలో  ప్రయాణికుల ఆదరణ లభించడం లేదు.దీంతో ప్రస్తుత  వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని  ప్రయాణికుల ఆదరణ పెంచుకొనేందుకు  టికెట్‌పై రాయితీలను అందజేస్తున్నారు. కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.10 వరకు ఈ రాయితీ లభిస్తుందని అధికారులు  తెలిపారు. ఏసీ బస్సుల్లో 5 స్టేజీలు లేదా  10 కి.మీ.దూరానికి  ప్రస్తుతం  రూ.50 చార్జీ ఉండగా, తాజా  రాయితీపైన రూ.40కే  ప్రయాణం చేయవచ్చు. అలాగే  10 స్టేజీలు లేదా  20 కి.మీ.దూరానికి  ప్రస్తుతం  నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సుల్లో  రూ.55 చార్జీ ఉండగా, రాయితీతో  రూ.45 కే  ప్రయాణం చేయవచ్చు.  

నగదు కష్టాలు.. 
మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ రెండేళ్లలో  ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.సుమారు  22 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. కానీ ప్రతిరోజు నగదు చెల్లించి  ప్రయాణం చేసే  పురుషుల సంఖ్య మాత్రం  పడిపోయింది.దీంతో మహిళల ఉచిత టికెట్లపైన ప్రభుత్వం నుంచి  లభించే  నిధులు  మినహా రోజువారీ  బస్సుల నిర్వహణ, ఇతరత్రా  ఖర్చుల కోసం డిపోల్లో నగదు కష్టాలు  పెరిగాయి.ఈ క్రమంలోనే పురుషుల సంఖ్యను పెంచాలని డ్రైవర్లు, కండక్టర్లపైన అధికారులు  ఒత్తిడిని పెంచారు. అదనపు ఆదాయంపైన దృష్టి సారించాలని సూచించారు. మరోవైపు తాజాగా వేసవి రద్దీ, డిమాండ్‌ను  దృష్టిలో ఉంచుకొని రాయితీలు  ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement