మధ్యకాలానికి మరింత లాభాలు
అనుకూలించనున్న ధరల పెరుగుదల
40 శాతం పెరగనున్న రుణ ఆస్తులు
క్రిసిల్ నివేదిక అంచనా
బంగారంపై రుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు) లాభదాయకత మధ్యకాలానికి బలంగా ఉంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం రుణాలకు ఇటీవలి కాలంలో డిమాండ్ గణనీయంగా పెరగడం తెలిసిందే. ఈ విభాగంలో బ్యాంకులు, తోటి ఎన్‌బీఎఫ్‌సీల నుంచి పోటీ నెలకొన్నప్పటికీ.. డిమాండ్‌కు తోడు నిర్వహణ సామర్థ్యం, రుణాలపై నష్టాలు తగ్గడం లాభదాయకత మెరుగుపడేందుకు అనుకూలించనున్నట్టు తన నివేదికలో పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) గోల్డ్ ఎన్‌బీఎఫ్‌సీల రిటర్న్ ఆన్ మేనేజ్డ్ అసెట్స్ (నిర్వహణ ఆస్తులపై రాబడి/ఆర్‌వోఎంఏ) 4.25–4.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.
రుణాలపై నష్టాలు చాలా తక్కువగా ఉంటుండడం, ఈ రుణాలవైపు కస్టమర్లు మొగ్గు చూపిస్తుండడంతో ఈ వ్యాపారం ఆకర్షణీయంగా మారిందని.. దీంతో బ్యాంక్‌లు, డైవర్సిఫైడ్ ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పోటీ పెరిగినట్టు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య గోల్డ్ ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 40 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది. పెద్దసైజు బంగారం రుణ ఎన్‌బీఎఫ్‌సీల్లో ఒక్కో శాఖ ఏయూఎం రూ.21 కోట్ల వరకు పెరిగిందని.. మధ్య స్థాయి ఎన్‌బీఎఫ్‌సీల్లో ఈ పెరుగుదల రూ.11.5 కోట్లకు చేరినట్టు క్రిసిల్ తెలిపింది. బంగారం ధరలు పెరగడం అధిక రుణ వృద్ధికి దారితీసినట్టు పేర్కొంది.
వృద్ధికి అనుకూలతలు..
అన్‌సెక్యూర్డ్ నుంచి సెక్యూర్డ్ అయిన బంగారం రుణాల వైపు డిమాండ్ మళ్లడం, బంగారంపై అధిక రుణానికి (లోన్ టు వ్యాల్యూ) ఆర్‌బీఐ అనుమతించడం, శాఖల విస్తరణలో వెసులుబాటు వృద్ధికి అనుకూలించనున్నట్టు క్రిసిల్ తెలిపింది. ‘‘బంగారం రుణాల్లో పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలకు నిర్వహణ వెసులుబాటు ఉంటుంది. బలమైన ఫ్రాంచైజీ నెట్‌వర్క్, ఒక్కో శాఖ నుంచి అధిక వ్యాపారం, టెక్నాలజీపై పెట్టుబడులతో స్థిర వ్యయాలను మరింత సమర్థవంతంగా అవి ఎదుర్కోగలవు’’అని క్రిసిల్ వివరించింది. ఇక పెరుగుతున్న డిమాండ్‌ను సొంతం చేసుకునేందుకు శాఖల విస్తరణపై దృష్టి పెట్టిన మధ్యస్థాయి గోల్డ్ ఎన్‌బీఎఫ్‌సీలు సమీప కాలంలో నిర్వహణ వ్యయాల పెరుగుదలను చూస్తాయని తెలిపింది. శాఖల సంఖ్య పెరిగి, ఉత్పాదకత మెరుగుపడితే, అప్పుడు వాటికి సైతం నిర్వహణ అనుకూలతలు కలిసొస్తాయని అంచనా వేసింది.
ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు


