పెట్టుబడులకు చక్కని వైవిధ్యం | Good Diversification of Investments | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు చక్కని వైవిధ్యం

Mar 2 2026 9:19 PM | Updated on Mar 3 2026 1:04 PM

Good Diversification of Investments

పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. దీని వల్ల నష్టాల రిస్క్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అన్ని పెట్టుబడులను ఒకే చోట పెట్టడం కంటే.. వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల నష్టాల రిస్క తగ్గుతుంది. ఒకే ఫండ్‌తో చక్కని వైవిధ్యం కోరుకునే వారికి పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ చక్కగా సరిపోతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులతో, తక్కువ నష్టాల రిస్‌్కతో ఈ పథకం మెరుగ్గా రాణిస్తోంది.

రాబడులు
ఈ పథకానికి మంచి రాబడుల చరిత్రే ఉంది. ఈ పథకం 2013లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున 19 శాతం చొప్పున రాబడులను అందించింది. గత ఐదేళ్లలోనూ రాబడి ఇదే స్థాయిలో ఉంది. మూడేళ్లలో మాత్రం ఏటా 20.94 శాతం చొప్పున, ఏడాది కాలంలో 10 శాతం మేర పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఫ్లెక్సీక్యాప్‌ విభాగం సగటు రాబడి కంటే 6 శాతం వరకు అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉండడం గమనించొచ్చు.

పెట్టుబడుల విధానం
మంచి రాబడుల అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్‌ చేసే స్వేచ్ఛ ఈ ఫండ్‌కు ఉంది. స్థానిక కంపెనీలతో పాటు విదేశీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ఈ పథకం చెప్పుకోతగ్గ స్థాయిలో ఇన్వెస్ట్‌ చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్‌బుక్‌లో ఈ పథకానికి గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. వ్యాల్యూ స్టాక్స్‌కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అంటే కంపెనీ వ్యాపారం, మూలాల పరంగా మంచి విలువ కలిగి, ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులు తెచ్చిపెట్టే వ్యూహాన్ని పాటిస్తోంది.

వాస్తవ విలువలకు మించి గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న స్టాక్స్‌కు దూరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్‌్కను సాధ్యమైనంత తగ్గించే విధంగా పనిచేస్తుంది. స్టాక్స్‌ను తరచూ మార్చదు. ఒక కౌంటర్‌లో దీర్ఘకాలం పాటు కొనసాగడాన్ని పాటిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలు కాకుండా.. ఎంతో విలువ దాగున్న స్టాక్స్‌ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా డెట్‌ సెక్యూరిటీలు, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లలో (రీట్‌)నూ ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. మధ్యకాల లక్ష్యాలకు (5–7 ఏళ్లు) దీర్ఘకాల లక్ష్యాలకు (10 ఏళ్లకు అంతకుమించి) ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.1,33,970 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 77.32 శాతం ఈక్విటీల్లో, డెట్‌ సాధనాల్లో 13.71 శాతం, ఈక్విటీ హెడ్జింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో 2.53 శాతం, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌)లలో 1.33 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 5.11 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. అత్యధికంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు 33.80 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 25.29 శాతం, కన్జ్యూమర్‌ డిస్క్రిషినరీ కంపెనీలకు 7.48 శాతం చొప్పున కేటాయించింది. ప్రతినెలా రూ.1000 నుంచి సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement