బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నిర్వహణలోని బంగారం రుణ ఆస్తులు (గోల్డ్ లోన్ ఏయూఎం) 207 మార్చి నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య 40 శాతం వృద్ధి చెందనున్నట్టు పేర్కొంది. 2023 నుంచి 2025 మధ్య వార్షిక రుణ వృద్ధి 27 శాతం కంటే అధికమని తెలిపింది. బంగారం ధరలు గణనీయంగా పెరగడం వాటిపై రుణ వితరణను వృద్ధి చేయనున్నట్టు పేర్కొంది.
‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో బంగారం ధరలు 68 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. దీంతో బంగారం తనఖా విలువ పెరిగింది. రుణదాతలు మరింత మొత్తంలో రుణ పంపిణీకి అవకాశం ఏర్పడింది. అన్‌సెక్యూర్డ్ తదితర విభాగాల్లో రుణ లభ్యతకు పరిమిత అవకాశాల నేపథ్యంలో రుణ గ్రహీతలు.. ఇతర మార్గాల్లో రుణాలపై దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో బంగారం రుణ సేవల్లోని ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకుల నుంచి గట్టి పోటీ నెలకొన్నప్పటికీ తమ మార్కెట్ వాటాను విస్తరించుకుంటున్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో వివరించింది.
బడా ఎన్‌బీఎఫ్‌సీల విస్తరణ..
బంగారం రుణాల్లోని బడా ఎన్‌బీఎఫ్‌సీలకు బ్రాండ్ గుర్తింపు ఉందని.. ఇవి తమ శాఖల వారీ పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ డైర్టెర్ అపర్ణ కిరుబకరణ్ తెలిపారు. మధ్యస్థాయి ఎన్‌బీఎఫ్‌సీలు ఒకవైపు తమ శాఖలను విస్తరిస్తూనే.. మరోవైపు ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకుల తరఫున భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. తక్కువ స్థాయి బంగారం రుణాలకు అధిక రుణాన్నిచ్చే (ఎల్‌టీవీ) నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నందున.. రుణ వితరణకు ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత వెసులుబాటు లభిస్తుందన్నారు. కాకపోతే ఎన్‌బీఎఫ్‌సీలు రిస్క్ మదింపు, నిర్వహణ ప్రక్రియలపై కఠిన నియంత్రణ కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా బంగారం స్వచ్ఛత, బరువు, కచ్చితమైన విలువ మదింపు అవసరమన్నారు. శాఖల స్థాయిలో నిర్ణీత కాలానికోసారి ఆడిట్ చేపట్టడమూ అవసరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..


