తిరుపతి చంద్రగిరిలో దారుణం.. | TDP Supporter Nagaraju Naidu Over Action At Chandragiri | Sakshi
Sakshi News home page

తిరుపతి చంద్రగిరిలో దారుణం..

Mar 18 2026 10:26 AM | Updated on Mar 18 2026 11:19 AM

TDP Supporter Nagaraju Naidu Over Action At Chandragiri

సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు కళ్ల ఎదుటే మహిళపై టీడీపీ కార్యకర్త దాడి చేస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రేక్షక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేస్తూ టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు రెచ్చిపోయాడు. భూ వివాదంలో ​విశ్వేశ్వరి అనే మహిళపై నాగరాజ నాయుడు దాడికి పాల్పడ్డాడు. ​సర్వే నెంబర్ 445/1A లోని 38 సెంట్ల స్థలం విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. ​కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా బేఖాతరు చేస్తూ నాగరాజ నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే బాధితురాలిపై విచక్షణా రహితంగా నాగరాజు నాయుడు.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

అనంతరం, బాధితురాలు మాట్లాడుతూ..‘టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, హేమ కుమార్, వంశీ ఒత్తిళ్లు వల్లే మాపై దాడి చేస్తున్నారు. మా భూమిని కబ్జా చేస్తున్నారు. ​పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి నన్ను రాజీ చేసుకోమని బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు ఈ విషయమై 12 సార్లు ఫిర్యాదు చేశాను. అయినా నాకు న్యాయం జరగలేదు. నన్ను చంపేస్తారని భయంగా ఉంది. నాకు న్యాయం చేయండి’ అని వేడుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement