వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్‌కు తొలిదశ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేగాదు వేల్స్‌ని ఒక విశ్వసనీయ సలహాదారుగా ప్రశంసించారు కూడా. ఆమె సాధ్యమైనంత తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె ఒక అద్భుతమైన చీఫ్ ఆఫ్ స్టాఫ్, అలాగే నాకు తెలిసిన అత్యంత బలమైన వ్యక్తులలో ఒకరామె. దురదృష్టవశాత్తు వేల్స్‌కి తొలిదశ రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు. ఆమె సత్వరమే ఈ సవాలుని స్వీకరించి ధైర్యంగా పోరాడాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నారు. ఆమెకు కోలుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఆమె వెంట అద్భుతమైన వైద్య బృందం ఉందని, చికిత్స సమయంలో, ఆమె దాదాపు పూర్తి సమయం వైట్ హౌస్‌లోనే గడుపుతారని పోస్ట్‌లో వెల్లడించారు ట్రంప్. ఈ నేపథ్యంలో తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే..?, ఇతర భాగాలకు వ్యాపించకముందే ముందుగా ఎలా గుర్తిస్తారు, ఎలాంటి చికిత్స అందిస్తారు, తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.
తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే ఏమిటి?
తొలిదశ రొమ్ము కేన్సర్‌లో సాధారణంగా స్టేజ్ 0, స్టేజ్ I, కొన్ని స్టేజ్ II కేన్సర్లు ఉంటాయి. ఈ దశలో, కణితి రొమ్ముకే పరిమితమై ఉంటుంది లేదా సమీపంలోని శోషరస కణుపులకు చాలా తక్కువగా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ కేన్సర్ ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నందున, తర్వాతి దశలతో పోలిస్తే సత్వరమే చికిత్స తీసుకుని సులభంగా కోలుకోగలుగుతారు సదరు రోగులు
అంతేగాదు 'ది బ్రెస్ట్' అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, స్టేజ్ I రొమ్ము కేన్సర్‌కు ఐదేళ్ల మనుగడ రేటు దాదాపు 90% కాగా, స్టేజ్ IVకు ఇది సుమారు 26% మాత్రమేనని తెలుస్తోంది. ఇక్కడ వైల్స్ విషయంలో "తొలిదశ" అనేది ఆమె సాధ్యమైనంత తొందరగానే ఈ సమస్య నుంచి బయటపడతారనేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక్కడ రొమ్ము కేన్సర్‌ను ముందుగానే గుర్తించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలను హైటెల్ చేసింది. ఈ దశలో మనుగడ రేట్లను గణనీయంగా మెరుగుపరుస్తుంది. చాలా సందర్భాలలో, తొలిదశ రొమ్ము కేన్సర్‌కు చికిత్స తీసుకుంటూనే రోజువారీ పనులను కొనసాగించొచ్చు కూడా.
ఇక్కడ వైల్స్ కూడా ఆ నేపథ్యంలోనే చికిత్స పొందుతూనే పని కొనసాగించాలని నిర్ణయించుకున్నారామె. కానీ ఈ తొలి దశలలో, రొమ్ము కేన్సర్‌ని అంత సులభంగా గర్తించకపోవచ్చు. అయితే, అది ఇచ్చే హెచ్చరిక సంకేతాలను విస్మరించకూడదు:
అవేంటంటే..
రొమ్ములో లేదా చంకలో గడ్డ
రొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పులు
చర్మంపై గుంటలు పడటం లేదా ముడతలు పడటం
తల్లిపాలు కాకుండా చనుమొన నుంచి ఇతర స్రావాలు రావడం
చనుమొన చుట్టూ చర్మం ఎర్రబడటం లేదా పొలుసులుగా మారడం
నిరంతర రొమ్ము నొప్పి
అన్ని గడ్డలూ కేన్సర్ గడ్డలు కావని గమనించడం ముఖ్యం, కానీ ఏదైనా అసాధారణ మార్పును వెంటనే ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.
ఈ కేన్సర్ ఎవరిలో అధికం అంటే..
వయస్సు: వయసు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది
కుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము కేన్సర్ ఉండటం ప్రమాదాన్ని పెంచుతుంది
జన్యు మార్పులు: BRCA1 మరియు BRCA2 వంటి వారసత్వంగా వచ్చే మార్పులు
హార్మోన్ల కారకాలు: చిన్న వయసులోనే రుతుస్రావం ప్రారంభం కావడం లేదా ఆలస్యంగా మెనోపాజ్ రావడం
జీవనశైలి కారకాలు: ఊబకాయం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం
అయితే, రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న చాలా మందికి ముందుగా ఎలాంటి స్పష్టమైన ప్రమాద కారకాలు కనిపించకపోవచ్చు. అందుకే క్రమం తప్పని స్క్రీనింగ్ చాలా కీలకం.
ఎలా నిర్ధారిస్తారంటే?
ఒక అధ్యయనం ప్రకారం, స్క్రీనింగ్ పరీక్షల్లో మహిళల్లో మామోగ్రఫీ అనే సాధనం మరణాల రేటును 20% వరకు తగ్గించగలదు. వాస్తవానికి సాధారణ స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే ప్రారంభ దశ రొమ్ము కేన్సర్‌ను చాలామటుకు సులభంగా గుర్తిస్తారు.
అత్యంత సాధారణ పద్ధతులు:
మామోగ్రఫీ: రొమ్ము ఎక్స్-రే, ఇది చిన్న కణితులను గుర్తించగలదు
అల్ట్రాసౌండ్: ఘన గడ్డలు, ద్రవంతో నిండిన తిత్తుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది
బయాప్సీ: కేన్సర్‌ను నిర్ధారించడానికి కణజాల నమూనాను తీసుకుంటారు
40 ఏళ్లు పైబడిన మహిళలకు లేదా అధిక ప్రమాదం ఉన్నవారికి క్రమమైన స్క్రీనింగ్ చాలా ముఖ్యం.
చికిత్సా పద్ధతులు
ప్రారంభ దశ రొమ్ము కేన్సర్‌కు చికిత్స అనేది కణితి పరిమాణం, రకం, అది వ్యాపించిందా లేదా అనే దానితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
సాధారణ చికిత్సా విధానాలు:
శస్త్రచికిత్స: కణితిని తొలగించడం (లంపెక్టమీ) లేదా మొత్తం రొమ్మును తొలగించడం (మాస్టెక్టమీ)
రేడియోథెరపీ: శస్త్రచికిత్స తర్వాత మిగిలిపోయిన కేన్సర్ కణాలను నాశనం చేయడానికి తరచుగా ఉపయోగిస్తారు
హార్మోన్ థెరపీ: హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్‌గా ఉండే కేన్సర్‌ల కోసం
కీమోథెరపీ: కొన్ని సందర్భాల్లో, కేన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి
టార్గెటెడ్ థెరపీ: నిర్దిష్ట కేన్సర్ కణ లక్షణాలపై దృష్టి పెడుతుంది
వైద్యులు సాధారణంగా ప్రతి వ్యక్తికి అనుగుణంగా చికిత్సా ప్రణాళికలను రూపొందిస్తారు. తద్వారా కొద్దిపాటి దుష్ప్రభావాలతో సులభంగా ఈ కేన్సర్ బారి నుంచి బయటపడేలా చేస్తారు. ఏదిఏమైనా ఈ రొమ్ము కేన్సర్‌ని ముందుగా గుర్తించడమనేది చాలా శక్తిమంతమైనది. ఎందుకంటే ఈ దశలో చికిత్స అందించడం సులభం అవుతుంది. కొద్దిపాటి చికిత్సతోనే తొందరగా బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: అంకుర్ వారికూ ఫిట్‌నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్‌కట్)


