ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌నకు భారీ ఊరట | Six Countries Support For Donald Trump In Hormuz Issue | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌నకు భారీ ఊరట

Mar 20 2026 7:13 AM | Updated on Mar 20 2026 8:44 AM

Six Countries Support For Donald Trump In Hormuz Issue

లండన్‌: హార్మూజ్‌ జలసంధి నుంచి క్షేమంగా రాకపోకలు సాగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్‌ ప్రకటించాయి. ఈ విషయంలో సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు గురువారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

ఈ సందర్భంగా హార్మూజ్‌లో నౌకలపై ఇరాన్‌ సైన్యం చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్‌లో నౌకల రాకపోలపై ఆంక్షల నేపథ్యంలో ఇంధన మార్కెట్లు స్థిరంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు స్పష్టంచేశాయి. ఈ విషయంలో సమన్వయంతో పని చేస్తామని తెలిపాయి. హార్మూజ్‌లో చమురు, గ్యాస్‌ నౌకల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని తేల్చిచెప్పాయి. ఇందుకోసం తమ ప్రయత్నాలు తాము చేస్తామని వివరించాయి. ఇంధన ఉత్పత్తి దేశాలతో కలిసి పని చేస్తామని పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ఉత్పత్తి మరింత పెరగాలని, తద్వారా మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించాయి.

ఇరాన్‌పై ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభమయ్యాయి. అందుకు ప్రతీకారంగా హార్మూజ్‌లో చమురు, గ్యాస్‌ నౌకల రాకపోకలపై ఇరాన్‌ ఆంక్షలు విధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌ కొరత ఏర్పడింది. చమురు, గ్యాస్‌ సరఫరా చేసే నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్‌ దాడులు చేయడం అత్యంత హేయమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్‌ మండిపడ్డాయి. చమురు నౌకలతో ఇరాన్‌కు ముప్పు ఉంటుందా? అని ప్రశ్నించాయి. ఇకనైనా దాడులు ఆపాలని, హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ను డిమాండ్‌ చేశాయి. ఇంధన సరఫరాకు అడ్డంకులు సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుందని ఆందోళన వ్యక్తంచేశాయి.   
 

 

Advertisement
 
Advertisement
Advertisement