సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించినున్నట్టు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ప్రభుత ఆసుపత్రులతో పాటు 421 ఎంపానల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు కానున్న ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్లరకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకం కింద మొత్తం 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
ఇదిలా ఉండగా.. బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇది తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు అత్యధిక కేటాయింపు కావడం విశేషం. అలాగే, ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు కేటాయింపు చేశారు. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా దక్కనుంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ బడ్జెట్ 2026-27.. హైలైట్స్ ఇవే..


