తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విజయ్ టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పచ్చ జెండా ఊపడం లేదు. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు విజయ్ లోక్‌భవన్‌లో ఉండగానే అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి అత్యవసరంగా గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
విజయ్ తర్వాత పళనిస్వామి తమిళనాడు గవర్నర్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. దీంతో విజయ్ టీవీకేకు ఆయన మద్దతు ఇస్తారా? ప్రభుత్వ ఏర్పాటునకు సహకరిస్తారా? లేదంటే మరేదైనా ట్విస్ట్ ఇస్తారా? అనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అన్నాడీఎంకేలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతుందని ఆ పార్టీ నూతన ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్ స్వయంగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారన్నది ఆ తర్వాత తెర మీదకు వచ్చిన ప్రచారం. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి గెలిచిన ఎమ్మెల్యేలను అత్యవసరంగా చెన్నైకి పిలిపించుకున్నారు. ఆపై టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే నుంచి ఓ ప్రకటన వెలువడింది.
కానీ, తెర వెనక మరో వ్యవహారం జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీతో కటీఫ్ చెప్పి.. టీవీకేకు మద్దతు ఇద్దామని అన్నాడీఎంకేలో ఓ వర్గం పళనిస్వామిపై ఒత్తిడి చేస్తోంది. ఈ డిమాండ్‌తో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో టీవీకేకు మద్దతు ఇచ్చేలా ఓ వర్గం(15 నుంచి 25 దాకా ఉన్నారనే టాక్) ఏర్పాటు అయ్యిందని.. అప్రమత్తమైన పళనిస్వామి వాళ్లను మందలించారని.. మొండిపట్టుతో ఉన్న షణ్ముగం టీం పాండిచ్చేరిలోని ఓ రిసార్ట్‌కు తరలిపోయిందని.. పళనిస్వామి వర్గం మాత్రం చెన్నైలోనే ఉండిపోయిందని.. ప్రచారం జోరందుకుంది. ఇది అన్నాడీఎంకేలో తిరుగుబాటుకు కారణం అయ్యే అవకాశమూ లేకపోలేదు. ఈ పరిణామాల దృష్ట్యా పళనిస్వామి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఒకవేళ విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చినా.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌ను కోరినా.. డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సంచలన ప్రకటన చేసినా.. ఇలా ఏది జరిగినా అది తమిళ రాజకీయాల్లో పళని పేల్చిన బాంబే కానుంది.


