పాకిస్తాన్‌కు అమెరికా ఝలక్‌.. కీలక ప్రకటన | US To Close Consulates in Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు అమెరికా ఝలక్‌.. కీలక ప్రకటన

May 7 2026 9:22 AM | Updated on May 7 2026 9:35 AM

US To Close Consulates in Pakistan

వాషింగ్టన్‌: దౌత్య సిబ్బంది భద్రత దృష్ట్యా పెషావర్‌లోని తమ కాన్సులేట్‌ను దశలవారీగా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఖైబర్‌ పఖ్తూంఖ్వాలోని దౌత్య సంబంధాల సంబంధిత విషయాలను ఇస్లామాబాద్‌లోని యూఎస్‌ రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు మంగళవారం యూఎస్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. దౌత్య సిబ్బంది భద్రత, వనరులను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

పెషావర్‌లో తమ కార్యాలయంను మార్చినప్పటికీ పాకిస్తాన్‌ విషయంలో అమెరికా ప్రభుత్వ విధాన ప్రాధాన్యతలు స్థిరంగానే ఉన్నాయని తెలిపింది. ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి, ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడానికి, అమెరికన్‌ ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రజలు, అధికారులతో అమెరికా సంప్రదింపులు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. యూఎస్‌–పాకిస్తాన్‌ సంబంధాలను ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లలో ఉన్న తమ దౌత్య కార్యాలయాలు, పాకిస్తాన్‌లోని యూఎస్‌ మిషన్‌ ద్వారా  ముందుకు తీసుకెళ్లడానికి శాఖ కట్టుబడి ఉందని పేర్కొంది.

ఆఫ్ఘన్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న పెషావర్‌ కాన్సులేట్, ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన అమెరికా కార్యకలాపాలలో ముఖ్య పాత్ర పోషించింది. ఒక కీలకమైన లాజిస్టికల్, దౌత్య కేంద్రంగా పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్‌కు భూమార్గాన్ని సులభతరం చేయడంతో పాటు, ఆ ప్రాంతంలోని అమెరికన్‌ పౌరులకు, ఆఫ్ఘన్‌ జాతీయులకు సహాయాన్ని అందించింది. ఈ కాన్సులేట్‌లో ప్రస్తుతం 18 మంది అమెరికన్‌ సిబ్బంది, 89 మంది స్థానిక సిబ్బంది పనిచేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement