పంజాబ్‌లో జంట పేలుళ్లు : 2027 ఎన్నికలకు బీజేపీ ప్లాన్‌ అంటున్న సీఎం | Punjab twin blasts Bhagwant Man says BJP is preparing for 2027 elections | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో జంట పేలుళ్లు : 2027 ఎన్నికలకు బీజేపీ ప్లాన్‌ అంటున్న సీఎం

May 6 2026 4:15 PM | Updated on May 6 2026 4:19 PM

Punjab twin blasts Bhagwant Man says BJP is preparing for 2027 elections

పంజాబ్‌లోని  అమృత్‌సర్, జలంధర్‌లలో  రెండు గంటల్లో రెండు వరుస పేలుళ్ల ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్లకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సంబంధం ఉందని, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ పన్నుతున్న పన్నాగాల్లో భాగమే ఇవని ఆయన ఆరోపించారు.  

ప్రజల్లో హింసను, భయాన్ని వ్యాపింపజేసి బీజేపీ ఓట్లు దండుకుంటుంది. కానీ పంజాబ్ ప్రజలు ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటారు, కనుక బీజేపీ ఇలాంటి చర్యల్ని మానుకోవాలని  సీఎం హితవు పలికారు. బీజేపీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే, అక్కడికి వెళ్లి గొడవలు సృష్టించడం పరిపాటి  అని మాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి ఈ  పేలుళ్లను 2027 ఎన్నికలతో ముడిపెట్టడంపై విపక్షాలు మండిపడ్డాయి. నిష్పక్షపాత విచారణ జరగకముందే రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నేతలు విమర్శించారు.

 జంట పేలుళ్ల కలకలం
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బిఎస్ఎఫ్ (BSF) పంజాబ్ ఫ్రాంటియర్స్ ప్రధాన కార్యాలయం వెలుపల పార్క్ చేసిన స్కూటర్‌లో పేలుడు సంభవించింది. మరో ఘటనలో రాత్రి 10.50 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ ఏరియా సమీపంలో మరో పేలుడు జరిగింది.ఈ పేలుడు ప్రభావం దాదాపు 300 మీటర్ల దూరం వరకు వ్యాపించింది.

జలంధర్ బిఎస్ఎఫ్ కార్యాలయం వెలుపల జరిగిన పేలుడుకు ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (KLA) బాధ్యత వహించింది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో గురుదాస్‌పూర్ జిల్లాలో పంజాబ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది రంజిత్ సింగ్ మరణానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు పేలుళ్ల తీవ్రతను,  దాని వెనుకున్న కుట్రను ఛేదించే పనిలో ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement