‘హంటా’ వైరస్‌ విలయం.. WHO కీలక ఆదేశాలు | WHO traces flight passengers travelled with Hanta virus | Sakshi
Sakshi News home page

‘హంటా’ వైరస్‌ విలయం.. WHO కీలక ఆదేశాలు

May 6 2026 9:21 AM | Updated on May 6 2026 9:41 AM

WHO traces flight passengers travelled with Hanta virus

ప్రయా (కేప్‌ వర్డే): అట్లాంటిక్‌ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్‌ నౌకలో హంటా వైరస్‌ కలకలం రేపుతోంది. హంటా వైరస్‌ ఆనవాళ్లు బయటపడటంతో, ‘ఎంవీ హోండియస్‌’నౌకలో ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది ప్రయాణికులు నౌకలోనే దిక్కుతోచని స్థితిలో బందీలుగా చిక్కుకుపోయారు. ఈ విషాదకర ప్రయాణంలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

హంటా వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందుతుందన్న భయంతో, కేప్‌ వెర్డే అధికారులు నౌకను తీరానికి రానిచ్చేందుకు నిరాకరించడంతో, సముద్రపు అలల మధ్య ఆ నౌక దిక్కుతోచని స్థితిలో నిలిచిపోయింది. ప్రయాణికులంతా తమ క్యాబిన్‌లకే పరిమితమయ్యారు. మాస్కులు, పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది తప్ప, ఎవరూ బయట అడుగు పెట్టలేని పరిస్థితి. అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రయాణికులందరూ తమ గదులకే పరిమితం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రత్యేకంగా నెదర్లాండ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించే యోచనలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.  

మరోవైపు.. సుదూర దక్షిణ అట్లాంటిక్ ద్వీపమైన సెయింట్ హెలెనా మరియు జోహన్నెస్‌బర్గ్ మధ్య విమానంలో ప్రయాణించిన 88 మంది ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. హంటా వైరస్ సోకడంతో ఒక క్రూయిజ్ షిప్ నుండి వెళ్లిన ప్రయాణికుడు మరణించాడని పేర్కొంది. కాగా, డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, ఆ ప్రయాణికుడు సెయింట్ హెలెనా నుండి దక్షిణాఫ్రికాకు విమానం ఎక్కడానికి ముందు ఒక క్రూయిజ్ నౌకలో ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో వైరస్ సోకి ఉండవచ్చని భావిస్తున్న తోటి ప్రయాణికులను, ఇతరులను గుర్తించి, సంప్రదించేందుకు ఆరోగ్య అధికారులు ఇప్పుడు కృషి చేస్తున్నారు.

నౌకలో వైరస్‌ వ్యాప్తి టైమ్‌లైన్‌

ఏప్రిల్‌ 1, 2026

  • నౌక అర్జెంటీనాలోని ఉషుయా నుండి బయలుదేరింది.
  • ప్రయాణికులు 20కి పైగా దేశాలవారు.

ఏప్రిల్‌ 5–7, 2026

  • కొంతమంది ప్రయాణికుల్లో జ్వరం, అలసట, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి.
  • మొదట సాధారణ వైరల్‌ ఇన్ఫెక్షన్‌గా భావించారు.

ఏప్రిల్‌ 10, 2026

  • ఒక డచ్‌ జంట తీవ్ర స్థితికి చేరి మరణించారు.
  • వైద్యులు హంటా వైరస్‌ అనుమానం వ్యక్తం చేశారు.

ఏప్రిల్‌ 12–15, 2026

  • మరికొంత మందిలో శ్వాస సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు.
  • ఒక జర్మన్‌ పౌరుడు మరణించాడు.
  • ఒక బ్రిటిష్‌ పౌరుడు దక్షిణాఫ్రికాలో ఐసీయూలో చేరాడు.

ఏప్రిల్‌ 18, 2026

  • నౌక కేప్‌ వెర్డే తీరంలో నిలిపివేయబడింది.
  • అక్కడి ప్రభుత్వం ప్రయాణికులను దిగనివ్వలేదు.

ఏప్రిల్‌ 20–25, 2026

  • WHO, EU జోక్యం.
  • ప్రయాణికులు కేబిన్లలోనే ఉండాలని ఆదేశాలు.
  • ఇద్దరు క్రూ సభ్యులు అత్యవసర వైద్య సహాయం అవసరమని ఆపరేటర్‌ తెలిపింది.

మే 1, 2026

  • స్పెయిన్‌ కానరీ దీవుల్లో డాక్‌ చేసేందుకు అనుమతి లభించింది.
  • ప్రయాణికులు, సిబ్బందిని పరీక్షించి, చికిత్స చేసి, వారి దేశాలకు పంపే ప్రణాళిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement