బెంగాల్‌లో కమల వికాసం, కనిపించని ‘మమత’
తమిళనాడులో బ్లాక్ బస్టర్‌గా స్టార్ విజయ్
కేరళలో తిరిగి కాంగ్రెస్‌కు పట్టం
2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ దళం తన హవాను చాటుకుంది. రెండు అద్భుతమైన విజయాలు, ఉత్సాహభరితమైన కమ్ బ్యాక్ వెరసి ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 3-5 స్కోర్‌లైన్‌ను కైవసం చేసుకోనుంది. లేడీ టైగర్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ప్రజాముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న స్టాలిన్, మరీ ముఖ్యంగా కేరళలో పినరయి విజయ్‌న్‌తోపాటు ఇతర నేతలకు కూడా ఇవొక గుణ పాఠంగా చెప్పవచ్చు. రాజకీయ ఉద్ధండులు, సిట్టింగ్ సీఎంలుగా ఉన్న ఈ ముగ్గురి నేతృత్వంలోని ఓటమి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ బీజేపీ ప్రభావం, హవా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ పాగా, కనిపించని ‘మమత’
దాదాపు 50 ఏళ్లుగా టీఎంసీ లేదా వామపక్షాలు మాత్రమే పాలించిన పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పాగా వేసింది. బలమైన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించి, తొలిసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. వామపక్ష రాష్ట్రం బెంగాల్‌లో, తమ ఉనికిని విస్తరించుకునే లక్ష్యంతో బయలుదేరిన బీజేపీకి పని చాలా కష్టతరమైంది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుని, రాష్ట్రంలో ఒక నామమాత్రపు పార్టీగా మాత్రమే ఉండేది. ఒక దశాబ్ద కాలంలోనే, బీజేపీ భారత చరిత్రలోనే అత్యంత అద్భుతమైన వృద్ధి పథంలో ఒకటిగా నిలిచింది. బెంగాల్‌లో రాజకీయ రంగంలో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన మమతా బెనర్జీకి గట్టి దెబ్బ కొట్టింది.
చారిత్రాత్మక నాలుగోసారి అధికారం చేపట్టాలని కన్న మమత అభేద్యమైన కంచుకోట, బీజేపీ మాయాజాలం ముఖ్యంగా మోదీ మాయాజాలంతో కూలిపోయింది. అలుపెరుగని మోదీ ర్యాలీలు, ప్రచారం, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారిస్తూ, మోదీ చొరబాటు ఆరోపణలపై టీఎంసీని లక్ష్యంగా చేసుకున్నారు. తనదైన శైలిలో దీదీ (మమత)ని ఎగతాళి చేశారు. దీనికి తోడు క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఆర్.జి. కార్, సందేశ్‌ఖాలి వంటి ఘటనలు, ఓటర్లలో నిరాశ, టీఎంసీ 'తోలాబాజీ'పై పెరుగుతున్న ఆగ్రహం వంటివి ఓటర్లు కొనసాగింపు కంటే "పరివర్తన్" (మార్పు)ను ఎంచుకునేలా చేశాయి. 2024లో ఒడిశాను జయించి, గత నెలలో బీహార్‌లో తమ సొంత ముఖ్యమంత్రిని నియమించుకున్న తర్వాత, తూర్పున బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
కేరళం మార్పుకే పట్టం! దెబ్బకొట్టిన కాంగ్రెస్
కేరళంలో కురువృద్ధుడు,ప్రజాదరణనేతగా పాపులర్ పినరయ్ విజయన్‌కు ఈ సారి ప్రజలు భారీ షాకే ఇచ్చారు. తన ప్రత్యర్థి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు వరుసగా రెండు పర్యాయాలు అధికారం ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)పై తన విశ్వాసాన్ని ప్రకటించారు. దీంతో కేరళం ఇప్పుడు తిరిగి యూడీఎఫ్ చేతుల్లోకి వచ్చింది.అవినీతి ఆరోపణలు, వామపక్షాల స్వరూపమే మారుతోందన్న ఆరోపణలతో సతమతమవుతున్న సీపీఎం, మరో ఐదేళ్లపాటు పాలించే అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలోని 140 స్థానాలకు గాను 100 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఆధిక్యంలో ఉంది. ఇది దక్షిణాదిలో తన ప్రాముఖ్యతను కాపాడుకోవాలని చూస్తున్న బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కాంగ్రెస్ ప్రచారంతోపాటు కేరళలో మార్పు పవనాలు వీచాయి. అస్సాం - పుదుచ్చేరిలో, NDA సునాయాస విజయాలు సాధించి, కీలకమైన ఈశాన్య, దక్షిణ కంచుకోటలలో తన పట్టును సుస్థిరం చేసుకుంది.
డీఎంకేకి షాక్, అరంగేట్రంలోనే విజయ్ అదుర్స్
తమిళనాడులో, నటుడు-రాజకీయవేత్త విజయ్ టీవీకే పార్టీ, అరంగేట్రంలో బ్లాక్‌బస్టర్ అరంగేట్రంతో విప్లవాత్మక విజయం దూసుకుపోతున్నాడు. ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలకు వెన్నెముకగా ఉన్న డీఎంకే , ఏఐఏడీఎంకే అనే రెండు కూటముల ద్విముఖ ద్రావిడ ఆధిపత్యాన్ని బద్దలు చేసింది. విజయ్ స్టార్ పవర్ ,రెండు ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలపై ఓటర్లలో పెరుగుతున్న అసహనం కారణంగా తమిళనాడులో ఆశ్చర్యకరమైన ఆధిక్యాన్ని అందించాయి. 2026లో నిజమైన మార్పును కోరుకుంటూ, ఓటర్లు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలోని పాత మూస ధోరణుల నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టమవుతోంది. తుదిఫలితాలు, తమిళనాడులో ఎన్నికల అనంతర పొత్తులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉన్నప్పటికీ, ఈ ఎన్నికలకు అసలైన సూపర్‌స్టార్ విజయేనన్నది స్పష్టం.
అస్సాంలో హిమంత హ్యాట్రిక్:
రాష్ట్రంలోని 126 స్థానాలకు గాను దాదాపు 100 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనే చిన్నపాటి వాదనను కూడా పూర్తిగా తోసిపుచ్చుతూ, అస్సాంలో తన అత్యంత ఆధిపత్య ప్రదర్శనను కనబరచడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై బీజేపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీతో హిమంత మూడోసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
పుదుచ్చేరిలో కూడా అధికారి బీజేపీ కూటమి మళ్లీ అధికారాన్ని చేపట్టనుంది. అయిదోసారి ఎన్. రంగస్వామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు.
ఇండియా కూటమికి కష్టాలేనా?
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొద్దికాలం పాటు ప్రోత్సాహకరంగా పుంజుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈ ఎన్నికల ఫలితాలు మరిన్ని కష్టాలు తప్పవనే సంకేతాలనిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు కేవలం ఒక తాత్కాలిక పరిణామం మాత్రమేనని ఎన్డీఏ నిరూపించడంతో, ఇప్పుడు ప్రతిపక్షం మళ్లీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎందుకంటే, బీజేపీ అన్ని ప్రత్యర్థి పార్టీలను పాతాళానికి తొక్కేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తోంది. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌లను పక్కన పెట్టడంతో, 2029 లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.


