విజయ్ రిసార్ట్ వ్యూహం: గెలిస్తే అక్కడికే.. | Tamil Nadu Exit Poll Shock, Vijay TVK Moves MLAs To Resort Amid Hung Assembly Fears, More Details Inside | Sakshi
Sakshi News home page

విజయ్ రిసార్ట్ వ్యూహం: గెలిస్తే అక్కడికే..

May 3 2026 11:25 AM | Updated on May 3 2026 1:21 PM

Vijays TVK Readies Resort for Winning MLAs

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మే 4)న వెలువడనున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మిశ్రమంగా ఉండటంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన దళపతి విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరతీసింది.

పూంజేరి రిసార్ట్‌లో భారీ ఏర్పాట్లు
మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ  ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే  ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ‘గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు’ అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన  వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
కౌంటింగ్ రోజున ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరుతూ భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) వినతిపత్రం సమర్పించాలని పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జునకు విజయ్ సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తమ పార్టీ లీగల్ వింగ్‌ను ఆయన అప్రమత్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ డీఎంకే, ఏఐఏడీఎంకే మరియు టీవీకే కూటముల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేయడంతో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విజయ్‌కు పాలిటిక్స్ ఒక హాబీ: డీఎంకే
మరోవైపు, అధికార డీఎంకే పార్టీ మాత్రం తామే అత్యధిక స్థానాలు సాధించి మళ్లీ అధికార పీఠం దక్కించుకుంటామని అత్యంత ధీమాగా ఉంది. కౌంటింగ్ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించింది. డీఎంకే అధికార ప్రతినిధి సేలం ధరణిధరన్ మాట్లాడుతూ.. రాబోయే దశాబ్దాల్లో డీఎంకేకు ప్రతిపక్షం ఎవరనేదే ఈ ఎన్నికల ప్రధానాంశమని వ్యాఖ్యానించారు. సర్వేల ప్రకారం 40% నుండి 55% మద్దతుతో స్టాలిన్ అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారని స్పష్టం చేశారు. విజయ్ ఏమాత్రం రాజకీయ నాయకుడు కాదని, రాజకీయాలు ఆయనకు కేవలం ఒక హాబీ మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement