అడ్వాన్స్ ఫీజుల దందాకు బ్రేక్.. ప్రైవేట్ స్కూళ్లకు షాక్‌! | Delhi Government Monthly Fee Payments Now Mandatory | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్ ఫీజుల దందాకు బ్రేక్.. ప్రైవేట్ స్కూళ్లకు షాక్‌!

May 2 2026 10:57 AM | Updated on May 2 2026 11:10 AM

Delhi Government Monthly Fee Payments Now Mandatory

న్యూఢిల్లీ: ఢిల్లీ విద్యాశాఖ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై అన్ని ప్రైవేట్ పాఠశాలలు నెలవారీ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేస్తూ, సంచలన ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలలకు లేదా ఏడాదికి ఒకేసారి ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 30న ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మధ్యతరగతి కుటుంబాలకు ఈ అడ్వాన్స్ ఫీజుల విధానం గుదిబండగా మారిందని, దీనివల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యాశాఖ పేర్కొంది. కేవలం నెలవారీ పద్ధతిలో మాత్రమే ఫీజులు తీసుకోవాలని కచ్చితమైన నిబంధనలు విధించింది. దీనివల్ల లక్షలాది మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం లభించింది. పాఠశాలలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి వీల్లేదని, విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ముందస్తు ఫీజు చెల్లింపును ఒక నిబంధనగా పెట్టకూడదని ప్రభుత్వం స్పష్టంగా తేల్చిచెప్పింది.

స్వచ్ఛంద చెల్లింపులకు ఓకే
తల్లిదండ్రులు తమ ఇష్టపూర్వకంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా ఫీజులు చెల్లించడానికి ముందుకు వస్తే, పాఠశాలలు ఆ మొత్తాన్ని స్వీకరించవచ్చని విద్యాశాఖ తాజా ఆదేశాలలో  పేర్కొంది. అయితే ముందస్తు ఫీజులు కట్టకపోతే అడ్మిషన్లు ఇవ్వబోమని లేదా ఇతర సేవలను నిలిపివేస్తామని ప్రైవేట్ స్కూల్స్ బెదిరింపులకు పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించింది. తల్లిదండ్రుల నుండి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది.

ఫీజుల విధానం  పారదర్శకంగా, పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఉండాలని అధికారులు పదేపదే  చెబుతున్నారు. దీనిపై గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కొన్ని స్కూళ్లు తమ ఇష్టానుసారంగా  ఫీజుల వసూలు విధానాలను అమలు చేస్తుండటం వల్లే ఇప్పుడు ఈ కొత్త కఠిన నిబంధనలను తీసుకురావాల్సి వచ్చింది.  ప్రభుత్వ ఆదేశాలను అన్ని ప్రైవేట్ స్కూళ్ల నోటీసు బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లలో కచ్చితంగా వారం రోజుల్లోగా ప్రదర్శించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించినా ఢిల్లీ పాఠశాల విద్యా చట్టం కింద కఠిన చర్యలు తప్పవని, స్కూల్ గుర్తింపు రద్దుతో పాటు యాజమాన్య బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: NEET 2026: ఈ తప్పులు అస్సలు చేయకండి! 

Advertisement
 
Advertisement
Advertisement