భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రస్తుతం ఉబెర్ కప్ టోర్నమెంట్‌తో బిజీగా ఉంది. డెన్మార్క్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సింధు తన ఆట తీరుతోనే కాకుండా.. కుడి కణతపై ధరించిన ప్రత్యేక పరికరంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ డివైస్ పేరు ‘టెంపుల్’.
ఎందుకీ ‘టెంపుల్’?
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ బృందం ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉండగా.. పీవీ సింధు ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో దీనిని ధరించడం విశేషం. మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ స్థాయిలను ‘టెంపుల్’ రియల్ టైమ్‌లో కొలుస్తుందని సమాచారం.
దీని ద్వారా మానసిక ఒత్తిడి, ఏకాగ్రత, మెదడు పనితీరును అంచనా వేయొచ్చని తెలుస్తోంది. నియర్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపి టెక్నాలజీతో ఇది మెదడులో ఆక్సిజన్ స్థాయిని కొలుస్తుందని సమాచారం. కేవలం ఇంచు పొడవు ఉండే ‘టెంపుల్’ను మూడు- నాలుగు గంటల పాటు ధరించవచ్చు.
ఇది బ్రెయిన్ ఫిట్‌నెస్ ట్రాకర్‌లా ఉపయోగపడుతుందని సమాచారం. ముఖ్యంగా క్రీడాకారులు మ్యాచ్ ఆడే సమయంలో లేదంటే ప్రాక్టీస్ సెషన్‌లో ఏకాగ్రత ఏ స్థాయిలో ఉంది? మానసిక ఒత్తిడి, అలసట, రికవరీ తదితర అంశాలకు సంబంధించిన డేటా విశ్లేషణకు ఈ డివైస్ ఉపయోగపడనుంది.

స్పందించిన సింధు భర్త
ఇక సింధు ధరించిన ‘టెంపుల్’ గురించి ఆమె భర్త వెంకటదత్త సాయి (Venkata Datta Sai) స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈ డివైస్ ద్వారా తన మెట్రిక్స్ కొలుస్తున్నాము. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది.
దీని ద్వారా వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఆరంభ దశలో వస్తున్న ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని వెంకటదత్త సాయి హర్షం వ్యక్తం చేశారు. కాగా క్రీడా ప్రపంచంలో ఇప్పుడు ఈ ‘టెంపుల్’ డివైస్ చర్చనీయాంశంగా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఉబర్ కప్ సింగిల్స్ మ్యాచ్‌లో 30 ఏళ్ల పీవీ సింధు తొలుత లీనీ క్రిస్టోఫర్‌సెన్‌ను ఎదుర్కొంది. ఆతిథ్య డెన్మార్క్ చెందిన 26 ఏళ్ల లినీని సింధు 21-13, 18-21, 21-17 తేడాతో ఓడించి గెలుపుజెండా ఎగురవేసింది.
పందొమ్మిదేళ్లు కాదని గుర్తు చేస్తోంది
ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు ముగించుకున్న తర్వాత పీవీ సింధు చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘‘రెండు గంటల్లో రెండు మ్యాచ్‌లు.. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అప్పుడు నా శరీరం.. ‘ఇంకా నీ వయసు 19 కాదు అని మర్యాదగా గుర్తు చేసింది. రెండు మ్యాచ్‌లు గెలవడం సంతోషంగా ఉంది’’ అని సింధు క్యాప్షన్ జతచేసింది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!


