స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తమిళనాడు వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం విజయ్ ముత్తుపాండిని అభినందించారు. ఆయన సాధించిన విజయం తమిళనాడుకు గర్వకారణమని అన్నారు. ముత్తుపాండి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముత్తుపాండి తమిళనాడులోని కోవిల్‌పట్టికి చెందినవారు.
కాగా, ముత్తుపాండి కామన్‌వెల్త్ క్రీడల పురుషుల 65 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు.
స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమైన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తాడు. అనంతరం 129 కిలోల ప్రయత్నం విఫలమైనప్పటికీ, 126 కిలోలతో ఆ విభాగాన్ని ముగించాడు.
క్లీన్ అండ్ జర్క్‌లో కూడా తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తి మొత్తం 286 కిలోల లిఫ్ట్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.


