ఆసుపత్రి నుంచి సోనమ్‌ వాంగ్‌చుక్‌ డిశ్చార్జ్‌.. నేరుగా అక్కడకు.. | Sonam Wangchuk discharged heads to Rajghat before returning home | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి నుంచి సోనమ్‌ వాంగ్‌చుక్‌ డిశ్చార్జ్‌.. నేరుగా అక్కడకు..

Jul 27 2026 3:40 PM | Updated on Jul 27 2026 4:11 PM

 Sonam Wangchuk discharged heads to Rajghat before returning home

గురుగ్రామ్‌: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్ సోమవారం గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన 6 రోజుల పాటు అక్కడ చికిత్స పొందారు. మెదాంతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే సోనమ్‌ వాంగ్‌చుక్ తన భార్య గీతాంజలి ఆంగ్మోతో కలిసి రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీకి కృతజ్ఞత చెప్పేందుకే వచ్చానని వాంగ్‌చుక్‌ అన్నారు. అహింసాయుత ఉద్యమం గాంధీ చూపిన మార్గమని చెప్పారు. 

ఇంతకు ముందు వాంగ్‌చుక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేస్తూ.. "ఈ రోజు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. నా శరీరం నెమ్మదిగా బలాన్ని తిరిగి పొందుతోంది" అని చెప్పారు. లద్ధాక్‌కు తిరిగి వెళ్లే ముందు మహాత్మా గాంధీకి నివాళి అర్పించేందుకు రాజ్‌ఘాట్‌కు వెళ్తానని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశ్నపత్రం లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో సాగిన విద్యార్థుల ఆందోళనకు పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

మెదాంతా ఆస్పత్రి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. "డిశ్చార్జ్ చేసే సమయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆయన పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఔట్‌ పేషెంగ్‌లా వచ్చి క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని సూచించాం" అని మెదాంతా ది మెడిసిటీ వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ దురాణి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

వాంగ్‌చుక్ జూలై 21న ఢిల్లీలో జరిగిన 'సంసద్ చలో' ర్యాలీ తర్వాత ప్రైవేట్ ఆసుత్రిలో చేరారు. జూలై 18న జంతర్ మంతర్ నుంచి ఆయనను తీసుకెళ్లి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 3 రోజుల పాటు చికిత్స పొందారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ జంతర్ మంతర్ వద్ద 26 రోజుల నిరాహార దీక్షకు నాయకత్వం వహించారు. ప్రధాన్ రాజీనామాకు ఒక రోజు ముందు, జూలై 24న ఆయన నిరాహార దీక్షను ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement