breaking news
Sonam Wangchuk
-
వాంగ్‌చుక్ అరెస్ట్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: లద్దాఖ్‌కు చెందిన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంతోపాటు లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద అరెస్ట్ చేసిన వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాంగ్‌చుక్ అరెస్ట్‌కు కారణాలు తెలిపాలని ఆయన భార్య గీతాంజలి కోరుతున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనానికి నివేదించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని, ఇప్పటికే వాంగ్చుక్కు ఈ మేరకు అధికారులు వివరాలు అందజేసినట్లు వివరించారు. నిర్బంధానికిగల కారణాలను భార్యకు తెలపాలనే నిబంధనేదీ లేదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఈ సమయంలో తామేమీ చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. అరెస్ట్‌కు కారణాలను తెలిపే విషయం పరిశీలించాలని సొలిసిటర్ జనరల్‌ను కోరింది. అదే సమయంలో, వాంగ్‌చుక్ వైద్య అవసరాలను జైలు నిబంధనలకు లోబడి తీర్చాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో రెండు రోజులపాటు కొనసాగిన ఆందోళనల్లో నలుగురు చనిపోగా 90 మంది గాయపడ్డారు. హింసకు వాంగ్‌చుక్ ప్రేరేపించారంటూ అధికారులు సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకుని, ఆ వెంటనే రాజస్తాన్‌లోని జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్ఎస్ఏ కింద అరెస్టయితే గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. -
లద్దాఖ్ కోసం పోరాటం ఆగదు
లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌తో శాంతియుత పోరాటం కొనసాగిద్దామని లద్ధాఖ్ ప్రజలకు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. గత నెల 24న లేహ్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారటంతో నలుగురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు కారకుడిగా పేర్కొంటూ జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద సోనమ్ వాంగ్చుక్ను అరెస్టు చేసి రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్ జైల్లో నిర్బంధించారు. వాంగ్‌చుక్ సోదరుడు క సెతన్ దోర్జీ లేతో కలిసి న్యాయవాది హాజీ ముస్తఫా శనివారం జైల్లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముస్తఫా ద్వారా లద్ధాఖ్ ప్రజలకు వాంగ్‌చుక్ సందేశం పంపారు. ‘నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నాను. నాకోసం ప్రారి్థంచినవారందరికీ ధన్యవాదాలు. లేహ్ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని, అరెస్టయినవారు ధైర్యంగా ఉండాలని ప్రారి్థస్తున్నాను. గత నెల 24న జరిగిన ఘర్షణపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. అలా విచారణ జరగని పక్షంలో నేను జైల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నా. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా ఇచ్చి ఆరో షెడ్యూల్ చేర్చాలన్న లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కేడీఏ)కు నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. డిమాండ్ల సాధన కోసం ప్రజలంతా శాంతియుతంగా, ఐకమత్యంతో సంపూర్ణంగా గాంధీ మార్గంలో పోరాటం చేయండి’అని వాంగ్‌చుక్ ఇచ్చిన సందేశాన్ని ముస్తఫా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. లేహ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. నిరసనకారులను సోమవారం చర్చలకు ఆహా్వనించింది. అయితే, వాంగ్‌చుక్‌తోపాటు పోలీసులు అరెస్టు చేసినవారందరినీ విడుదల చేసి, లేహ్ ఘటనపై జ్యుడీíÙయల్ విచారణకు ఆదేశించేంతవరకు చర్చల్లో పాల్గొనబోమని ఎల్ఏబీ, కేడీఏ తేల్చి చెప్పాయి. -
వాంగ్‌చుక్ నిర్బంధం అక్రమం
న్యూఢిల్లీ: ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను నిర్బంధించడం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాంగ్చుక్ను వెంటనే విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌తో ఆయన దీక్షకు పూనుకోవడం, కేంద్ర పాలిత ప్రాంతంలో నిరసనలు హింసాత్మక రూపం దాల్చి నలుగురు చనిపోగా 90 మంది వరకు గాయపడటం తెల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు ఆయన్ను సెపె్టంబర్ 26న అదుపులోకి తీసుకుని, రాజస్తాన్‌లోని జోథ్‌పూర్ జైలుకు తరలించారు. అంగ్మో తరఫున సీనియర్ లాయర్ వివేక్ తన్ఖా హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. వెంటనే విచారణ చేపట్టి, వాంగ్చుక్ను సుప్రీంకోర్టులో హాజరు పరచాలంటూ లద్దాఖ్ యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు. ఆయన్ను నేరుగా, ఫోన్ ద్వారా కలిసి మాట్లాడేందుకు తక్షణమే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర హోం శాఖ, లద్దాఖ్ యంత్రాంగం, లేహ్ డిప్యూటీ కమిషనర్, జోథ్‌పూర్ జైలు సూపరిటెండెంట్లను ఇందులో ప్రతివాదులుగా చేరారు. ‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక సంస్కర్త అయిన వాంగ్‌చుక్, లద్దాఖ్‌లో పర్యావరణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధేయ విధానంలో, శాంతియుతంగా సాగే ఆందోళనలను మాత్రమే సమర్థించారు’అని అందులో పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష సాగించిన వాంగ్‌చుక్ తిరిగి కోలుకుంటున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. అత్యవసరమైన వస్తువులు, మందులు తీసుకోనివ్వకుండా కుటుంబసభ్యులతో మాట్లాడనీయకుండా హడావుడిగా ఆయన్ను జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అందులో ఆరోపించారు. ఇప్పటి వరకు ఆ నిర్బంధానికి గతల కారణాలను కుటుంబసభ్యులకు అధికారులు వెల్లడించలేదని పిటిషన్లో తెలిపారు. తనను దాదాపుగా గృహ నిర్బంధంలో ఉంచారని అంగ్మో తెలిపారు. వాంగ్‌చుక్ స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లద్దాఖ్ (హెచ్ఐఏఎల్) విద్యార్థులను, సిబ్బందిని అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. వాంగ్చుక్కు విదేశీ సంస్థలతో సంబంధాలను అంటగడుతూ దు్రష్పచారం సాగిస్తున్నారన్నారు. నిర్బంధానికి సంబంధించిన ఉత్తర్వులను బయటపెట్టాలని, అరెస్ట్‌కు కారణాలను తెలిపే అన్ని రికార్డులను బహిర్గతం చేయాలని కోరారు. వాంగ్చుక్కు వెంటనే డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించి, ఆరోగ్య నివేదికలను బయటపెట్టాలన్నారు. -
సోనమ్‌ను వేటాడుతున్నారు
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తున్న తన భర్తను కేంద్ర ప్రభుత్వం వేటాడుతోందని, అందులో భాగంగానే ఆయనపై దేశద్రోహ చట్టం (ఎన్ఎస్ఏ) కింద తప్పుడు కేసులు పెట్టారని ఆయన సతీమణి గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. సోనమ్ వాంగ్చుక్పై నమోదుచేసిన కేసులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రభుత్వ అధికారులకు సవాల్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వాంగ్‌చుక్‌తో ఇప్పటివరకు నన్ను మాట్లాడనివ్వలేదు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులు నాకు ఇవ్వలేదు. నన్ను కూడా దాదాపు గృహనిర్బంధంలో పెట్టినట్లుగా పరిస్థితులు కల్పించారు. వాంగ్చుక్పై ఎన్ఎస్ఏ ప్రయోగించాల్సిన అవసరం లేదు. అధికారులు ఒకేవైపు మాట్లాడుతున్నారు. ఒకరకంగా ఆయనను వేటాడుతున్నారు. ఆయన దేశద్రోహి అయితే భారత ప్రభుత్వం ఆయనకు ఎందుకు అనేక అవార్డులు ఇచ్చింది? లడక్‌కు రాష్ట్రహోదా ఇవ్వాలని, దానిని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమాన్ని బలహీనపర్చేందుకే ఇదంతా చేస్తున్నారు’అని గీతాంజలి ఆరోపించారు. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కోసం ఈ నెల 24న లేహ్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారి నలుగురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఉద్యమకారులను వాంగ్‌చుక్ రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్టు చేసి రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్ జైల్లో నిర్బంధించారు. వాంగ్‌చుక్ చుట్టూ కుట్ర సోనమ్‌వాంగ్‌చుక్ కార్యకలాపాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా పనిగట్టుకొని కొందరు ప్రచారం చేస్తున్నారని గీతాంజలి ఆరోపించారు. ‘మా సంస్థ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెరి్నంగ్ (హెచ్ఐఏఎల్)కు సంబంధించిన అన్ని పత్రాలను సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందించాం. అయినా ఆయన కార్యకలాపాలపై అనుమానాలు రేకెత్తించేలా ప్రచారం జరుగుతోంది. వాంగ్చుక్కు మెగసెసె అవార్డు రావటంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ అవార్డును తీసుకోవటం తప్పు అన్నట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు? దాదాపు 60 మంది భారతీయులకు మెగసెసె వచ్చింది. వారిలో 20 మందికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులు కూడా ఇచ్చింది. అంటే భారత ప్రభుత్వం దేశద్రోహులకు పద్మ అవార్డులు ఇచ్చిందా?’అని నిలదీశారు. లద్దాఖ్‌లో పాకిస్తాన్ జాతీయులు ప్రవేశించటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంచేశారు. ‘లద్దాఖ్‌లో పాకిస్తానీలు ఉన్నట్లు వాళ్లు (అధికారులు) గుర్తిస్తే.. పొరుగు దేశం వాళ్లను మనదేశంలోకి అక్రమంగా ఎందుకు రానిచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది వాంగ్‌చుక్ కాదు. కేంద్ర హోంశాఖ. 24న హింస జరుగుతున్నప్పుడు వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. ఆ ఘటనకు లద్దాఖ్ అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి’అని స్పష్టంచేశారు. గత ఏడేళ్లలో వాంగ్‌చుక్ పరిశోధనల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గీతాంజలి తెలిపారు. ‘హెచ్ఐఏఎల్ పరిశోధనల ద్వారా ఆవిష్కరించిన సౌరశక్తితో వెచ్చగా ఉండే భవనాలు, ఐస్ స్తూపం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. గత ఏడేళ్లలో 1,80,000 చదరపు అడుగుల సోలార్ హీటెడ్ భవనాలు నిర్మించారు. వాటివల్ల నెలకు 4,000 టన్నుల కార్బన్ ఆదా అవుతోంది. ఈ సాంకేతికత ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటి పనులను మెచ్చుకోకపోతే దేశం విశ్వగురు ఎలా అవుతుంది?’అని ప్రశ్నించారు. -
సీఆర్పిఎఫ్ వల్లే లేహ్‌లో హింస
లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్రహోదాతోపాటు దానిని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్‌చేస్తూ ఐదేళ్లుగా శాంతియుత పోరాటం చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్వాంగ్చుక్కు పాకిస్తాన్‌తో సంబంధాలు అంటగట్టడం దారుణమని ఆయన సతీమణి గీతాంజలి ఆంగ్మో (Gitanjali J Angmo) మండిపడ్డారు. లేహ్‌లో ఈ నెల 24న చోటుచేసుకున్న హింసకు సీఆర్పిఎఫ్ బలగాలే కారణమని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపైకి సీఆర్పిఎఫ్ బలగాలు భాష్పవాయు గోళాలు ప్రయోగించటంతో ఆగ్రహించిన యువత రాళ్లు రువ్విందని తెలిపారు. సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టడం వల్లే హింస చెలరేగిందన్న పోలీసుల వాదనను ఆమె తోసిపుచ్చారు. నాటి హింస, తర్వాతి పరిణామాలపై గీతాంజలి ఆంగ్మో ఆదివారం మీడియాతో మాట్లాడారు. వాంగ్‌చుక్ కలలో కూడా హింసాత్మక ఉద్యమాన్ని ఊహించలేదని తెలిపారు. ఈ నెల 24న చెలరేగిన హింసలో నలుగురు మరణించగా, 90 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రసంగమే కారణమని లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రప్రభుత్వం.. వాంగ్చుక్ను అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేసి రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు పంపింది. వారి స్వచ్ఛంద సంస్థ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెరి్నంగ్ (హెచ్ఐఏఎల్) లైసెన్స్‌ను కూడా రద్దుచేసింది. ఎన్ఎస్ఏ (NIA) కింద అరెస్టు చేస్తే ఎలాంటి విచారణ లేకుండా 12 నెలలపాటు జైల్లో నిర్బంధించవచ్చు. నా భర్తతో మాట్లాడనివ్వటం లేదు వాంగ్చుక్ను అరెస్టు చేసిన నాటి నుంచి ఆయనతో కనీసం మాట్లాడేందుకు కూడా పోలీసులు తనకు అనుమతి ఇవ్వటం లేదని గీతాంజలి ఆరోపించారు. ‘సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధ ఆదేశాల కాపీని శుక్రవారం నాకు అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇవ్వలేదు. దీనిపై మేము న్యాయపోరాటం చేస్తాం. పాకిస్తాన్లో ఇటీవలి మా పర్యటన పూర్తిగా వృత్తిగతమైనది, పర్యావరణ పరమైనది. వాంగ్‌చుక్ విదేశీ పర్యటనలన్నీ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన యూనివర్సిటీలు, సంస్థలు పంపిన ఆహ్వానాల మేరకే జరిగాయి. వాతావరణ మార్పులపై పాకిస్తాన్లో ఐక్యరాజ్యసమితి (United Nations) విభాగం నిర్వహించిన సమావేశానికి మేం హాజరయ్యాం. ఆ సదస్సును నిర్వహించిన సంస్థలు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ (ఐసీఐఎంఓడీ) సంస్థకు సంబంధించినవే. ఈ సంస్థలో హిందూకుష్ పర్వతాలతో ముడిపడి ఉన్న 8 దేశాలైన భారత్, నేపాల్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, భూటాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ సభ్యులుగా ఉన్నాయి. పర్యావరణ మార్పులలో మహిళల పాత్రపై పరిశోధన పత్రం సమఆర్పించేందుకు నేను ఆ సదస్సుకు వెళ్లాను. ఆ సదస్సులో ప్రధాని మోదీని వాంగ్‌చుక్ ఎంతో పొడిగారు. సోనమ్ వాంగ్చుక్పై ఎన్ఎస్ఏను ప్రయోగించటం దారుణం. ఆయన ఎన్నడూ శాంతిభద్రతలకు విఘాగం కలిగించే పని చేయలేదు. ఆయన ఎప్పుడూ గాంధీ మార్గంలోనే ఉద్యమం నడిపారు. 24న హింస చెలరేగటానికి ముందు విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వీడియోలు మా వద్ద ఉన్నాయి. ఆ సమయంలో సీఆర్పిఎఫ్ (CRPF) కాల్పులు జరపటానికి ఎవరు అనుమతి ఇచ్చారు? మీ సొంత ప్రజలపై, యువతపై కాల్పులు ఎందుకు జరిపారు? ఆ రోజు ఆయన ఎవరినీ రెచ్చగొట్టలేదు. మార్పు అనేది ఒక వ్యక్తితోనో, ఒకరి మరణం వల్లనో ప్రారంభమవుతుంది.బహుషా ప్రాణాలు అర్పించే ఆ ఒక్క వ్యక్తిని నేనే కావచ్చు. ఈ ఉద్యమం కోసం సంతోషంగా నా ప్రాణాలఆర్పిస్తాను అని వాంగ్‌చుక్ చెప్పారు. కానీ, ఆయన మాటలను వక్రీకరించారు. అయినా, భారత సైన్యానికి షెల్టర్ల కోసం, చైనా వస్తువుల బహిష్కరణకు ఉద్యమిస్తున్న వ్యక్తిని దేశద్రోహి అని ఎలా అంటారు?’ అని గీతాంజలి ప్రశ్నించారు. ఎహెచ్ఐఏఎల్ సంస్థ అక్రమంగా విదేశీ విరాళాలు స్వీకరిస్తోందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) అనుమతి మేరకే విరాళాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. -
వాంగ్చుక్కు పాక్‌తో సంబంధాలు.. పక్కా ఆధారాలున్నాయి: డీజీపీ
లేహ్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు నిన్న(సెప్టెంబర్ 26 శుక్రవారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. లద్దాఖ్ రాజధాని లేహ్‌లో జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడ్డారు. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్చుక్ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయంటూ లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్న డీజీపీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను కూడా ఆయన సందర్శించినట్లు లద్దాఖ్ డీజీపీ వెల్లడించారు. ఓ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారితో వాంగ్చుక్కు సంబంధాలున్నాయని పేర్కొన్న డీజీపీ.. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ స్పష్టం చేశారు. పాక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వాంగ్‌చుక్ హాజరైనట్లు తేలిందన్నారు.కాగా, లద్దాఖ్‌లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్‌చుక్ కారణమంటూ కేంద్ర హోంశాఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. -
సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టు
లేహ్/శ్రీనగర్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్(59)ను పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అరెస్టు చేశారు. లద్దాఖ్ రాజధాని లేహ్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడిన సంగతి తెలిసిందే. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్చుక్ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. లేహ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. వాంగ్చుక్ను లద్దాఖ్ నుంచి రాజస్థాన్‌లోని జో«థ్పూర్కు తరలించారు. ఆయనపై ఏయే అభియోగాలు మోపారన్న దానిపై పోలీసుల ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ఉన్న లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన కొన్నేళ్లుగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నెల 10న నిరాహార దీక్ష ప్రారంభించారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమకారులు బుధవారం ఇచి్చన బంద్ పిలుపు హింసాత్మకంగా మారింది. లేహ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధించారు. హింస నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించారు. లద్దాఖ్‌లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్‌చుక్ కారణమని కేంద్ర హోంశాఖ గురువారం ఆరోపించింది. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. నన్ను బలిపశువును చేయడానికి కుట్ర: వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్‌చుక్ గురువారం ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చకుండా వారి దృష్టిని మళ్లించడానికే తనపై నిందలు వేస్తోందని ఆరోపించారు. తనను బలిపశువుగా మార్చడం పక్కనపెట్టి జనం ఆకాంక్షలు నెరవేర్చాలని హితవు పలికారు. మరోవైపు వాంగుచుక్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఆరోపణలు నిరూపించగలరా?: గీతాంజలిసోనమ్ వాంగ్చుక్ను నేరçస్తుడిలా పరిగణిస్తున్నారని ఆయన భార్య గీతాంజలి అంగ్మో మండిపడ్డారు. వాంగ్‌చుక్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కేంద్రం తప్పుడు ప్రచారానికి తెరతీసిందని విమర్శించారు. పోలీసులు తమ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. తన భర్తను జాతివ్యతిరేక శక్తిగా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. ఎలాంటి విచారణ గానీ, కారణంగా గానీ లేకుండా ఆయనను బలవంతంగా లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా జరడం దారుణమని అన్నారు. తన భర్త ఐదేళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నారని, ఏనాడూ హింసను ప్రేరేపించలేదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తూ ఎన్నో పురస్కారాలు పొందారని గుర్తుచేశారు. మేధావులకు, విద్యావేత్తలకు ఇచ్చే మర్యాద అదేనా? అని ప్రశ్నించారు. తన భర్తపై చేస్తున్న ఆరోపణలు నిరూపించగలరా? టీవీలో చర్చకు సిద్ధమా? అని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గీతాంజలి అంగ్మో సవాలు విసిరారు. అరెస్టు దురదృష్టకరంసోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అరెస్టు చేయడం దురదృష్టకరమని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. లద్దాఖ్ ప్రజలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, అందుకే ప్రజలు పోరుబాట పట్టారని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచి్చందని, ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
లద్దాఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్
ఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) లద్దాఖ్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం లద్దాఖ్‌లో జరిగిన అల్లర్లకు కారణం వాంగ్చుక్గా కారణంగా భావిస్తూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హింసను రెచ్చగొట్టినట్టు వాంగ్చుక్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాంగ్‌చుక్ ఎన్జీవో లైసెన్స్‌ను సైతం కేంద్రం రద్దు చేసింది.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఆయన స్థాపించినస్వచ్ఛంద సంస్థ( SECMOL)కు విదేశీ నిధులు స్వీకరించే హక్కును కూడా రద్దు చేసింది. అరెస్టుకు ముందు వాంగ్‌చుక్ వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉద్యమం కోసం అరెస్టయితే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. లద్దాఖ్ రాష్ట్ర హక్కుల కోసం ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించించిన సంగతి తెలిసిందే. దీంతో వాంగ్‌చుక్.. తాను చేపట్టిన రెండు వారాల దీక్షను కూడా ఆయన ముగించిన సంగతి తెలిసిందే.లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో జనం బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు.ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు. -
సోనమ్ వాంగ్చుక్పై సీబీఐ ఉచ్చు.. విదేశీ నిధుల సేకరణ, పాకిస్తాన్ పర్యటనపై దర్యాప్తు
లేహ్: లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమించిన ఒక గ్రూపును విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోనమ్ వాంగ్‌చుక్ స్థాపించిన ఒక సంస్థపై నిఘా సారించింది. ఈ సంస్థ విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టాన్ని ఉల్లంఘించిందనే అనుమానం వ్యక్తం చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు సంస్థ రెండు నెలల క్రితం హిమాలయన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ (హెచ్ఐఏఎల్) సేకరించిన నిధులపై విచారణను ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న వాంగ్‌చుక్ పాకిస్తాన్ పర్యటనపై కూడా సమీక్షిస్తున్నదని సమాచారం.వాంగ్‌చుక్ నిరాహార దీక్ష అనంతరం..కాగా లడఖ్ జిల్లాలో కర్ఫ్యూ పరిస్థితుల్లో భద్రతా దళాలు, లడఖ్ ఉద్యమ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు మృతిచెందారు. 40 మంది పోలీసు సిబ్బందితో సహా 80 మంది గాయపడ్డారు. వాంగ్‌చుక్ తన పక్షం రోజుల నిరాహార దీక్షను ఉపసంహరించుకున్న తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఘర్షణల్లో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించిన తర్వాత లేహ్ అపెక్స్ బాడీ యువజన విభాగం నిరసనలకు పిలుపునిచ్చింది.రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే..దీంతో కొందరు యువకులు యువకులు గ్రూపులుగా బయలుదేరి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, హిల్ కౌన్సిల్‌ను లక్ష్యంగా చేసుకుని విధ్వంసకాండకు పాల్పడ్డారు. లడఖ్ పట్టణం అంతటా మోహరించిన పోలీసులు, పారామిలిటరీ దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే హింస చెలరేగిందని కేంద్రం ఆరోపించింది. లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి.ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఉద్దేశపూర్వక కాల్పులంటూ ఆరోపణలుసీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు. -
లేహ్ పరిణామాలు.. కేంద్రం సంచలన ఆరోపణలు
రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ అమలు కోరుతూ గత కొంతకాలంగా కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్‌లో జరుగుతున్న ఆందోళనలు.. ఒక్కసారిగా హింసాత్మక మలుపు తిరిగాయి. సోమవారం లేహ్‌లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో నలుగురు మృతి చెందగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ హింసకు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను బాధ్యుడిగా చేస్తూ కేంద్రం సంచలన ఆరోపణలకు దిగింది. ఎంతో మంది నేతలు సోనమ్ వాంగ్చుక్ను(Sonam Wangchuk) కలిసి నిరాహార దీక్షను విరమించమని కోరారు. అయినా ఆయన మొండిగా ముందుకు వెళ్లారు. అరబ్ స్ప్రింగ్ ఉద్యమం, నేపాల్‌లో తాజాగా జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావిస్తూ అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. ఆయన ప్రసంగాల వల్లే రెచ్చిపోయిన కొందరు యువకులు బీజేపీ కార్యాలయంపై దాడి సహా పలు విధ్వంసాలకు పాల్పడ్డారు. లడాఖ్ యువతను ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారని, సంకుచిత రాజకీయాలకు.. వ్యక్తిగత లబ్ధికి వాళ్లు బలయ్యారని, కేంద్రం మాత్రం అక్కడి యువత సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొంది. అంతేకాదు.. ఈ హింస సహజంగా జరగలేదని.. కావాలని ప్రేరేపించారని, ఒక వ్యూహం ప్రకారం పక్కా ప్రణాళికాబద్ధంగానే జరిగిందని సంచలన ఆరోపణలు చేసింది కేంద్రం. ఈ ఘటనలపై ఇప్పటికే కొన్ని కీలక వర్గాలు సేకరించినట్లు చెబుతున్న కేంద్ర హోం శాఖ వర్గాలు.. అత్యున్నత దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశాయి. 👉బుధవారం సాయంత్రం కల్లా లేహ్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని.. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. లడాఖ్‌లో ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే.. .. ‘ఇది లడాఖ్‌కు, నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖదాయకమైన రోజు. గత ఐదేళ్లుగా మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం. కానీ ఈ రోజు హింస జరిగింది, ఇది మా శాంతి సందేశాన్ని విఫలమయ్యేలా చేసింది. మా యువత ప్రాణాలు కోల్పోతే దీక్షకు అర్థం ఉండదు. అందుకే దీక్షను వెంటనే విరమిస్తున్నాను’ అని సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు. అదే సమయంలో.. కేంద్రం చేసిన ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.👉తన ఈ ఉద్యమం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, లడాఖ్ ప్రజల హక్కుల కోసం మాత్రమేనని సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. నేపాల్ Gen Z ఉద్యమాన్ని ప్రస్తావించడం.. కేవలం ఇక్కడి జనాల్లో చైతన్యాన్ని పెంచేందుకు మాత్రమేనని, అది హింసకు ప్రేరణ ఇవ్వడం ఏమాత్రం కాదని అన్నారాయన. ఇప్పటిదాకా ఈ ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగానే సాగిందని గుర్తు చేశారు. లడాఖ్ హక్కుల విషయంలో కేంద్రంలోని బీజేపీ యూటర్న్, నిరుద్యోగ సమస్య.. ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. ‘‘ప్రభుత్వం ఇకనైనా మా శాంతి సందేశాన్ని వినాలి. పోలీసులు నిరసకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం ఆపాలి. శాంతి నిరసనలే మా మార్గం. హింస వల్ల మా లక్ష్యం దూరమవుతుంది. యువత కూడా కవ్వింపు చర్యలను మానాలి. ఇది మన ఉద్యమానికి హాని చేస్తుంది’’ అని పిలుపు ఇచ్చారాయన.సోనం వాంగ్‌చుక్ ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త & పర్యావరణ పరిరక్షకుడు. ఆయన సెక్మోల్ (Students' Educational and Cultural Movement of Ladakh) అనే సంస్థను స్థాపించి సంప్రదాయ విద్యా విధానాలకు భిన్నంగా పిల్లలకు అనుభవాధారిత(ప్రాక్టికల్స్) విద్యను బోధించేవారాయన. తద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సోనం వాంగ్‌చుక్ విధానాల నుంచి ఇన్స్పిరేషన్తో.. 2009లో దర్శకుడు రాజ్‌కుమార్ హీరాణీ ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ ‘రాంచో’ పాత్రను రూపొందించారు. అంతేకాదు.. వినూత్న విద్యా విధానాలు, పర్యావరణ పరిరక్షణ, లడాఖ్ ప్రజల అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆసియా ప్రతిష్టాత్మక అవార్డు రామన్ మెగసెసే ఆయనకు దక్కింది కూడా.👉అయితే.. లడాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, అలాగే ఆరవ షెడ్యూల్ (Sixth Schedule) అమలు చేయాలని సోనమ్ వాంగ్చ్క్ తన దీక్షను సెప్టెంబర్ 10, 2025న ప్రారంభించారు. పదిహేను రోజుల తర్వాత.. లడాఖ్‌లోని లేహ్ జిల్లా కేంద్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో దీక్షను మధ్యలోనే విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆరవ షెడ్యూల్.. అనేది త్రిపుర, మేఘాలయ, మిజోరం మరియు అస్సాం రాష్ట్రాల్లోని గిరిజనుల పాలనకు ప్రత్యేకంగా రూపొందించబడిన రాజ్యాంగ అధికార పరిమితులు(Provision). ఆరవ షెడ్యూల్ అమలుతో గిరిజన ప్రాంతాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భారత రాజ్యాంగంలోని Article 244 ప్రకారం.. స్థానిక స్వయం పాలన, భాష.. సంస్కృతి.. సంప్రదాయల రక్షణ, ప్రత్యేక న్యాయవ్యవస్థ, ఆర్థిక స్వాతంత్రం, విద్యా..ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభిస్తాయి. దీంతో లడాఖ్‌లోనూ దీనిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎపెక్స్ బాడీ లేహ్(LAB.. రాజకీయ సంఘాల సమ్మేళనం), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్(KDA) గత నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్నాయి. సోమవారం లేహ్‌లో చోటు చేసుసున్న హింసాత్మక ఘటనల్లో 50 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. కేంద్రం ఇప్పటికే అక్టోబర్ 6న లాబ్, కేడీఏ ప్రతినిధులతో హై పవర్డ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. గతంలో కూడా చర్చలకు ప్రయత్నించినప్పటికీ, సానుకూల స్పందన రాలేదని బుధవారం రాత్రి వెలువరించిన ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: 'ఐ లవ్ మహ్మద్'పై కశ్మీర్ సీఎం స్పందన


