
న్యూఢిల్లీ: లద్దాఖ్‌కు చెందిన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంతోపాటు లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ)కింద అరెస్ట్ చేసిన వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది.
వాంగ్‌చుక్ అరెస్ట్‌కు కారణాలు తెలిపాలని ఆయన భార్య గీతాంజలి కోరుతున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనానికి నివేదించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని, ఇప్పటికే వాంగ్‌చుక్‌కు ఈ మేరకు అధికారులు వివరాలు అందజేసినట్లు వివరించారు. నిర్బంధానికిగల కారణాలను భార్యకు తెలపాలనే నిబంధనేదీ లేదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఈ సమయంలో తామేమీ చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. అరెస్ట్‌కు కారణాలను తెలిపే విషయం పరిశీలించాలని సొలిసిటర్ జనరల్‌ను కోరింది.
అదే సమయంలో, వాంగ్‌చుక్ వైద్య అవసరాలను జైలు నిబంధనలకు లోబడి తీర్చాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో రెండు రోజులపాటు కొనసాగిన ఆందోళనల్లో నలుగురు చనిపోగా 90 మంది గాయపడ్డారు. హింసకు వాంగ్‌చుక్ ప్రేరేపించారంటూ అధికారులు సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకుని, ఆ వెంటనే రాజస్తాన్‌లోని జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్టయితే గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు.