న్యూఢిల్లీ: అరబిక్ కంట్రీ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. 40 దేశాలకు చెందిన కోళ్లు, గుడ్లపై పూర్తిగా నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి తదితర కారణాలతో 40 దేశాల కోళ్లు, గుడ్ల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధిత జాబితాల భారత్ కూడా ఉంది. ఇటీవల కాలంలో కోళ్లకు వస్తున్న రోగాల కారణంగా సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా డ్రగ్ అథారిటీ(ఎస్‌ఎఫ్‌డీఏ) స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలతో పాటు అంటు వ్యాధులు కూడా ఎక్కువగా ఉండటంతో సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. 40 దేశాల ఫౌల్ట్రీ, గుడ్లపై ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. 2004 నుంచి పలు దేశాలపై ఈ నిషేధం అమల్లో ఉండగా, అందులో ఇప్పుడు భారత్ కూడా చేరింది.
ఈ జాబితాలో భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్, అజర్‌బైజాన్, జర్మనీ, ఇండోనేషియా, ఇరాన్, బోస్నియా, హర్జేగోవినా, బల్గేరియా, బంగ్లాదేశ్, తైవాన్, డిజిబౌటి, దక్షిణాఫ్రికా, చైనా, ఇరాక్, ఘనా, పాలస్తీనా, వియత్నాం, కంబోడియా, కజక్‌స్తాన్, కామెరూన్, దక్షిణ కొరియా, లావోస్, లిబియా, మయన్మార్, ద యునైటెడ్ కింగ్‌డమ్, ఈజిప్టు, మెక్సికో, మంగోలియా, నేపాల్, నైగర్, నైజీరియా, హాంకాంగ్, జపాన్, బుర్కినా ఫాసో, సెర్బియా, స్లోవెనియా, ఇవారీ కోస్ట్ తదితర దేశాలున్నాయి.
భారత పౌల్ట్రీపై తీవ్ర ప్రభావం?
ఇది భారత పౌల్ట్రీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ గుడ్లు, కోడి ఉత్పత్తుల ప్రధాన మార్కెట్‌లలో సౌదీ అరేబియా ఒకటి. ఈ నిషేధం వల్ల భారతీయ ఎగుమతిదారులు తీవ్ర ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎగుమతి ఆగిపోవడంతో దేశీయ మార్కెట్లో గుడ్లు, కోడి మాంసం సరఫరా పెరుగుతుంది. అధిక సరఫరా కారణంగా రైతులు, ఉత్పత్తిదారులు తక్కువ ధరలకు అమ్మకాలు చేయాల్సి రావచ్చు.


