సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట నుంచి ఆ దేశంలోని ఒంటెలకు ప్రత్యేక ఫోటోతో కూడిన పాస్‌పోర్టులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచంలో సౌదీ ఒంటెలకున్న ప్రత్యేకతను తెలియజేయడానికే ఈ ప్రత్యేక ప్రాజెక్టుకు చేపట్టనున్నట్లు అక్కడి మంత్రిత్వశాఖ తెలిపింది.
సౌదీ విజన్ 2030లో భాగంగా అక్కడి సాంస్కృతిక చిహ్నామైన ఒంటెలకు ప్రత్యేక గుర్తింపు కలిపించనున్నట్లు అక్కడి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ గుర్తింపుతో ఆ దేశంలో ఒంటెల పెంపకం రంగం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. ఈ పాస్‌పోర్టులో మైక్రోచిప్ నెంబర్, దాని పేరు, పుట్టిని తేదీ, రంగు, జాతితో పాటు ఆ వివరాలిచ్చిన పశువైద్యుని సంతకం కూడా ఉండనున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
దీనివల్ల ఒంటెలకు సంబంధించిన యజమాన్య హక్కుల విషయంలో వివాదం తలెత్తదని అంతేకాకుండా వాటికి ఆరోగ్యపరమైన విషయాలు తెలుసుకోవడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ చర్యలతో అంతర్జాతీయ మార్కెట్‌లో సౌదీ ఒంటెలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అక్కడి మంత్రిత్వ శాఖ తెలిపింది.


