సౌదీ అరేబియా చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలు అమలు చేసే దేశంలో సౌదీ ముందు వరుసలో ఉంటుంది. తాజా నివేదికలు సైతం అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. కేవలం ఒక్క వారంలోనే ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఉల్లంఘించినందుకు 18 వేలకు పైగా కార్మికులను అరెస్టు చేసినట్లు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
గతవారం సౌదీ అరేబియాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు భారీ స్థాయిలో ఆపరేషన్ చేపట్టి 18,200 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 11,422 మంది వలసదారుల చట్టాలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేసినట్లు తెలిపారు. 3,858 మందిని సరిహద్దు భద్రతా చట్టాలను 3,951 మంది కార్మిక చట్టాలు అతిక్రమించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు అక్రమంగా సౌదీలోకి ప్రవేశించడానికి యత్నించిన 2,827మందిని బంధించినట్లు తెలిపారు.
అయితే ఇదివరకే 14,451 మందిని ఇప్పటికే దేశం నుంచి బహిష్కరించినట్లు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించిన వారిలో దాదాపు 53 శాతం ప్రజలు ఇథియోపియా దేశానికి చెందిన వారు కాగా 46 శాతం మంది యెమెన్‌కు చెందిన వారు. సౌదీలో చట్టాలను అతిక్రమించిన వారికి ఆశ్రయం కల్పించినా ఏదైనా సహాయం చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. వారికి జైలుశిక్ష వేయడంతో పాటు వారి ఆస్తులు జప్తుచేస్తారు.
అయితే ఇటీవల సౌదీలో పనిచేస్తున్న ఓ భారతీయుడు ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తికి లిప్ట్ ఇచ్చాడు. ఆ విషయం అతనికి తెలియదు. అయితే ఆ సమయంలోనే భద్రతా అధికారులు తనిఖీలు జరిపగా ఆ విదేశీయుడు అక్రమంగా సౌదీలోకి ప్రవేశించినట్లు తేలింది. దీంతో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తితో పాటు అతనికి లిఫ్ట్ ఇచ్చినందుకు ఆ భారతీయున్ని అరెస్టు చేశారు. అనంతరం అతడి ఉద్యోగం సైతం పోయింది.
దీంతో ఆ బాధితుడు ఇండియాకు తిరిగి వచ్చాడు. కనుక జీవనోపాధి కోసం సౌదీ వెళ్లేవారు అక్కడి చట్టాలపై అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


