‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌! | Dubai Turns Into a Ghost Town Amid Rising Middle East Tensions | Sakshi
Sakshi News home page

‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌!

Mar 14 2026 3:51 AM | Updated on Mar 14 2026 4:11 AM

Dubai Turns Into a Ghost Town Amid Rising Middle East Tensions

దుబాయ్ అంటే సాధారణంగా మెగా భవనాలు, విలాసవంతమైన రిసార్ట్‌లు, మిచెలిన్-స్టార్ రెస్టారెంట్లతో ఆకర్షణీయమైన పర్యాటక నగరంగా ప్రపంచానికి తెలుసు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో దుబాయ్‌ పరిస్థితి మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత భద్రతా ఆందోళనలు పెరగడంతో దుబాయ్ నగరం క్రమంగా వెలవెలబోతూ ‘ఘోస్ట్‌ టౌన్‌’ను తలపిస్తోంది.

ఇరాన్ క్షిపణి దాడుల ప్రభావం గల్ఫ్ ప్రాంతంపై తీవ్రంగా పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లోని పలు బీచ్ బార్లు, స్విమ్మింగ్ పూల్స్, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. గూచీ వంటి హై-ఎండ్ దుకాణాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. అలాగే దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్, గ్లోబల్ విలేజ్ థీమ్ పార్క్, ఐన్ దుబాయ్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షణలను కూడా తాత్కాలికంగా మూసివేశారు.

సాధారణంగా వీకెండ్ సమయంలో ట్రాఫిక్‌తో కిక్కిరిసే నగరం ఇప్పుడు అసాధారణంగా ప్రశాంతంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అనేక హోటళ్లలో అతిథులు తగ్గిపోవడంతో యజమానులు తమ సిబ్బందికి సెలవులు ఇచ్చి పంపుతున్నారు. పర్యాటకులు లేకపోవడంతో హోటళ్లు తక్కువ ధరలకు గదులు అందిస్తున్నాయి.

ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాలా మంది స్థానికులు, పర్యాటకులు దుబాయ్‌ను విడిచివెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యం నుంచి బయలుదేరే విమానాల్లో దాదాపు సగం విమానాలు రద్దు అయినట్లు ట్రావెల్ అనలిటిక్స్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా దుబాయ్‌లో నివసిస్తున్న విదేశీయులు, వలస కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచిన దుబాయ్ గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించింది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల నగర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధికారులు మాత్రం తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలు ధ్రువీకరించని సమాచారాన్ని పంచుకోరాదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement