ప్రపంచంలోనే తొలిసారి.. కాగితం లేని ‘బుక్ స్టోర్’ | Audible Opens World's First Bookless Bookstore | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలిసారి.. కాగితం లేని ‘బుక్ స్టోర్’

May 2 2026 1:59 PM | Updated on May 2 2026 2:29 PM

Audible Opens World's First Bookless Bookstore

న్యూయార్క్‌: పుస్తకం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పేపర్లు, అక్షరాలు, పెద్ద పెద్ద లైబ్రరీలు. కానీ, ఆ ఊహలను పూర్తిగా మారుస్తూ.. ప్రపంచంలోనే తొలిసారిగా ‘పుస్తకాలు లేని బుక్ స్టోర్’ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ అమెజాన్ అనుబంధ సంస్థ ‘ఆడిబుల్’ న్యూయార్క్‌ నగరంలో ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నేటి తరం పాఠకులు పుస్తకాలు చదవడం కంటే ఆడియో కథలు వినేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఈ పాప్-అప్ స్టోర్‌ను ఆవిష్కరించింది.

ఆడిబుల్ స్టోరీ హౌస్.. ఒక సరికొత్త ఊహ
మాన్‌హాటన్‌లోని లోయర్ ఈస్ట్ సైడ్‌లో ప్రారంభమైన ఈ ‘ఆడిబుల్ స్టోరీ హౌస్’లో ఒక్క భౌతిక పుస్తకం కూడా కనిపించదు. బెస్ట్ సెల్లర్ పుస్తకాల అరలు, కాగితాల చప్పుడు ఇక్కడ అస్సలు ఉండవు. ఈ ప్రదేశాన్ని కేవలం ‘ఆడియో స్టోరీటెల్లింగ్’ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆడిబుల్ సీఈఓ బాబ్ కారిగాన్ మాట్లాడుతూ.. ఆడియో కథలకి ప్రాణం పోసేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న  ఐడియా నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టిందని, ఇది ఒక సాహసోపేతమైన ప్రయోగం అని పేర్కొన్నారు.

స్టోరీ టైల్స్‌తో వినూత్న అనుభూతి
ఈ స్టోర్‌ లోపల అరల నిండా ‘స్టోరీ టైల్స్’ అనే ఆడియోబుక్ టాబ్లెట్లు ఉంటాయి. సందర్శకులు వాటిని అక్కడే ఉన్న ప్లేయర్‌లో ఉంచి హెడ్‌ఫోన్స్ ద్వారా కథలు వినవచ్చు. ఈ టైల్స్ ద్వారా షార్ట్ ప్రివ్యూ వినొచ్చు. ఆపై పూర్తి పుస్తకాన్ని ఆడిబుల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. హెడ్‌ఫోన్స్ లేకుండా గ్రూప్‌గా కూర్చొని ఆడియో వినేందుకు స్పీకర్లతో కూడిన ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. అలాగే ‘లిజనింగ్ బార్’ వద్ద ఉండే ‘స్టోరీ టెండర్స్’.. విజిటర్స్ అభిరుచికి తగ్గ ఆడియోబుక్స్‌ను ఎంపిక చేయడంలో సహాయపడతారు.

పెరుగుతున్న ఆడియోబుక్స్‌ క్రేజ్
అమెరికాలో ఆడియోబుక్స్‌కు డిమాండ్ భారీగా పెరుగుతున్న తరుణంలో ఈ బుక్ లెస్ స్టోర్ రావడం విశేషం. ఆడియో పబ్లిషర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. 2024లో అమెరికాలో ఆడియో బుక్ అమ్మకాలు 2.22 బిలియన్ డాలర్ల(రూ. 9,491 కోట్లు)కు చేరుకున్నాయి. గత ఐదేళ్లలో ఈ మార్కెట్ దాదాపు రెట్టింపు అయింది. సంప్రదాయ పుస్తక పఠనంలోని ఆత్మీయతను, ఆధునిక శ్రవణ అలవాట్లను కలబోసి.. ఆఫ్‌లైన్ ద్వారా సరికొత్త అనుభూతిని పంచడమే లక్ష్యంగా ఆడిబుల్ ఈ ఈ స్టోర్‌ను నడపనుంది.

ఇది కూడా చదవండి: చిన్నారిపై వార్డెన్, వంటవాని పైశాచికం

Advertisement
 
Advertisement
Advertisement