బరువు తగ్గడం అనేది తరుచుగా కఠినమైన డైట్‌లు, డిటాక్స్ పద్ధతులు, తీవ్రమైన వ్యాయామాలతో ముడిపడి ఉంటుంది. కొందరు తక్కువ వ్యవధిలో బరువు తగ్గించే షార్ట్‌కట్‌లు వెతుక్కుంటారు. కానీ ఇలాంటివి ఏవి అవసరం లేకుండానే స్థిరమైన మార్పులతో బరువు తగ్గగలరని చెబుతున్నారు పుణెకు చెందిన క్లినికల్ ఫార్మసిస్ట్ అండ్ ఆరోగ్య విద్యావేత్త డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.
డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా తన రోగులలో ఒకరు ఎలాంటి తీవ్రమైన డైట్ లేదా డిటాక్స్ కార్యక్రమాన్ని పాటించకుండా 8 కిలోలు ఎలా తగ్గగలిగారో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ పేషెంట్ రక్త పరీక్షల్లో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉంది.
అతడు చాలా తక్కువగా ఫుడ్ తీసుకుంటున్నా ఇలా ఈ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం అతనిలో భయాన్ని రేకెత్తించి తన వద్దకు వచ్చినట్లు తెలిపారు. అయితే డాక్టర్ దవాయివాలా సమస్య అతను ఎంత తిన్నాడు అనే దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదని అంటున్నారు. శరీరమే దీనికి కారణం అన్నారు.
అదెలా అంటే..
మన శరీరమే కొంత కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఇది మన జీవనానికి ముఖ్యమైన పదార్థం. ఇది కణ త్వచాలు, హార్మోన్లు, విటమిన్ డి కొవ్వును జీర్ణం చేసే పైత్యరస ఆమ్లాలకు ఒక కీలకమైన నిర్మాణ మూలకం. శరీరం సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగినప్పుడు సాధారణంగా అదనపు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అందుకు గల కారణాలు ఏవంటే..
సరిగా నిద్రపోకపోవడం
విటమిన్ డి లోపం
ఇన్సులిన్ నిరోధకత
క్రమరహిత భోజనం
కనీస శారీరక శ్రమ
అందువల్ల సమస్య కొలెస్ట్రాల్ కాదు. ఇది దెబ్బతిన్న జీవనశైలి చక్రానికి సంబంధించిన ఒక లక్షణం
కొలెస్ట్రాల్, బరువు తగ్గేలా ఏం చేయాలంటే..
అదనపు ఫైబర్ (అవిసె, చియా, నానబెట్టిన ఓట్స్)
ఒమేగా-3లు
సమతుల్యమైన ఆహారం, ఏదీ మానకూడదు
ప్రతిరోజూ ఉదయం సూర్యరశ్మి, మెగ్నీషియం
విటమిన్ డి సప్లిమెంట్లు
ఈ మార్గదర్శక జీవనశైలి మార్పుల ద్వారా, రోగి మొత్తం కొలెస్ట్రాల్ 248 mg/dL నుంయి 187 mg/dLకి తగ్గింది. అతను 8 కిలోల బరువు తగ్గాడు, అతని విటమిన్ డి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. పైగా అతని నిద్ర మెరుగుపడింది, అతిగా తినడం కూడా ఆపగలిగాడు.
ఇందులో ఎలాంటి తీవ్రమైన డైట్లు లేదా జిమ్మిక్కులు లేవు. కేవలం స్థిరమైన, మార్గదర్శక ప్రయత్నం మాత్రమే. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని లేదా బరువును అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నట్లయితే, పోషకాహార నిపుణులు లేదా ఫిట్‌స్ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు డాక్టర్ దవాయివాలా.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: గ్లోబల్ మైండ్‌సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..)


