సాక్షి, విజయవాడ: చంద్రబాబు హామీ అంటేనే మోసమని మరోసారి రుజువైంది. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన "ఆడబిడ్డ నిధి" పథకంపై చంద్రబాబు చేతులెత్తేశారు. ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ బుకాయిస్తున్నారు. దీంతో, మహిళల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ప్రకటించిన "సూపర్-6" హామీల్లో ఆడబిడ్డ నిధిపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారు. జూన్ 2024 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని కూడా హామీ ఇచ్చారు. అయితే తాజాగా తిరుపతిలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినంత అనుకూలంగా లేదని, భారీ సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉందని బుకాయించారు. దీంతో ఆడబిడ్డ నిధి అమలుపై అనుమానాలు మరింత పెరిగాయి.
కాగా, రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల మంది మహిళలకు ఈ పథకం వర్తించనుంది. గత రెండేళ్లుగా అమలు కాలేకపోవడంతో ఒక్కో మహిళకు రూ.36 వేల మేర ప్రయోజనం దక్కకుండా పోయింది. ఇక, ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి ఆడబిడ్డ నిధి హామీతో టీడీపీ నాయకులు బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడు ఆ హామీ అమలుపై మాత్రం చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ బాండ్లను నమ్మి ఎదురుచూసిన మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పుడు ఆ బాండ్లు ఏం చేయాలో మహిళలకు పాలుపోవడం లేదని అంటున్నారు. ఇక, కూటమి అధికారంలోకి వచ్చాక.. మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు ఇచ్చిన అన్నీ పథకాలను చంద్రబాబు రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ, కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రం చంద్రబాబు అమలు చేయడం లేదు. దీంతో, కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సిందేనని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.


