సీనియర్ నటి పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) తీసుకుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఆమె ఈ రోజు(జులై 28) హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు.
పావలా శ్యామల గారి కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అంత్యక్రియల నిర్వహణకు 'మా' (MAA) ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించనుండగా, ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు తెలిపారు.
కాగా.. పలు టాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న శ్యామల.. చివరి రోజుల్లో దీన స్థితిని గడిపారు. చికిత్సకు డబ్బుల్లేక ఎన్నో అవస్థలు పడ్డారు. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగించి.. ఈ రోజు కన్నుమూశారు. ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.


