ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ)పూర్తిగా నిండిపోవడంతో తీవ్రమైన వైద్య ఆరోగ్య సంక్షోభం తలెత్తింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఈ దుస్థితి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది.
జనాభా భారీగా పెరిగినా.. మౌలిక వసతులు శూన్యం
ఇస్లామాబాద్‌లోని ప్రముఖ పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్) ఆస్పత్రిని కేవలం 5 లక్షల మంది జనాభా కోసం ప్రారంభించారు. కానీ నేడు సుమారు 50 లక్షల మందికి పైగా ప్రజల వైద్య అవసరాలను ఈ ఒక్క ఆసుపత్రే తీర్చాల్సివస్తోంది. జనాభా పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, నిపుణులైన వైద్య సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్రమైన భారం పడుతోంది.
సీనియర్ జర్నలిస్ట్ మరణంతో..
పాక్‌కు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అబిద్ రజా కజ్మీకి పక్షవాతం రావడంతో వైద్యులు వెంటనే వెంటిలేటర్‌పై ఉంచాలని సూచించారు. కానీ పిమ్స్ ఆసుపత్రిలోని 12 ఐసీయూ వెంటిలేటర్లు అప్పటికే పూర్తిగా నిండిపోయాయి. కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గం మధ్యలోనే ఆయన మరణించారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లో నెలకొన్న ఆరోగ్య సంక్షోభం అసలు స్వరూపాన్ని దేశం ముందుంచింది.
అందని ద్రాక్షలా వెంటిలేటర్లు
పిమ్స్ ఆస్పత్రిలో సుమారు 90కి పైగా వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చే తీవ్రమైన రోగులకు అవి వెంటనే దొరకడం లేదు. న్యూరాలజీ, పల్మోనాలజీ విభాగాల్లో చేరిన రోగులు కొన్నిసార్లు 15 నుంచి 20 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉండాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రాణరక్షక పరికరాలు నిరంతరం వినియోగంలో ఉండి, అత్యవసర సమయాల్లో ఖాళీగా ఉండటం లేదు.
‘నో రిఫ్యూజల్' విధానంతో..
ఎలాంటి తీవ్రమైన రోగితోనైనా సరే చికిత్సను తిరస్కరించకూడదనే కఠినమైన నిబంధన పిమ్స్ ఆస్పత్రిలో అమలవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులను కూడా ఈ విధానం వల్ల వెనక్కి పంపకుండా చేర్చుకుంటున్నారు. పడకలు ఖాళీ లేకపోయినా స్ట్రెచర్‌లపైనే చికిత్స అందించాల్సి వస్తోంది. ఇది మానవతా దృక్పథంతో మంచిదే అయినప్పటికీ, పరిమిత వనరుల మధ్య ఆసుపత్రిపై అంతులేని ఒత్తిడిని పెంచుతోంది.
కేవలం కొత్త యంత్రాలు కొంటే సరిపోతుందా?
ప్రభుత్వం కేవలం పెద్ద సంఖ్యలో కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేయడం వల్ల మాత్రమే ఈ సంక్షోభం సమసిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి వెంటిలేటర్‌ను సరిగ్గా ఆపరేట్ చేయడానికి శిక్షణ పొందిన ఎనస్థీషియస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులు, నర్సులు, టెక్నీషియన్లు అత్యవసరం. కానీ పాకిస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఇటువంటి నిపుణులైన మానవ వనరుల కొరత చాలా తీవ్రంగా ఉంది.
గగనంగా మారిన ప్రైవేట్ వైద్యం..
పాకిస్థాన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులలో ఐసీయూ వైద్యం సామాన్యులకు అందనంత ఖరీదైనదిగా మారింది. ఒక్కో రోగికి రోజువారీగా సుమారు 3 లక్షల పాకిస్థానీ రూపాయల వరకు ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. అంత భారీ మొత్తాన్ని భరించే ఆర్థిక స్థోమత లేకపోవడం కారణంగా మధ్యతరగతి, పేద ప్రజలు పూర్తిగా ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఆధారపడవలసి వస్తోంది.
ప్రాథమిక వైద్య రంగం విఫలం
దేశంలోని జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైన సేవలు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. స్థానిక స్థాయిలోనే నయం కావాల్సిన చిన్నపాటి రోగాలతో కూడిన రోగులు కూడా నేరుగా పెద్ద ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా పెద్ద ఆస్పత్రులపై అనవసరమైన భారం పడి, నిజమైన అత్యవసర రోగులకు వైద్యం దక్కని పరిస్థితి ఏర్పడుతున్నది.
ఇది కూడా చదవండి: నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!


