జాబిల్లిని ఢీకొట్టనున్న రాకెట్‌ శకలం!  | SpaceX rocket crashes into the moon, 5August 2026 | Sakshi
Sakshi News home page

జాబిల్లిని ఢీకొట్టనున్న రాకెట్‌ శకలం! 

Jul 28 2026 4:38 AM | Updated on Jul 28 2026 4:38 AM

SpaceX rocket crashes into the moon, 5August 2026

సరిగ్గా ఇంకో ఎనిమిది రోజులు! 
అంటే ఆగస్టు 5వ తేదీ...  
చందమామపై ఓ రాకెట్‌ శరవేగంతో
 కుప్పకూలిపోనుంది! 

రాక్షసబల్లులు అంతరించిపోయేందుకు ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనడం కారణమని అంటారు. ఆగస్టు ఐదున జాబిల్లిని ఢీకొట్టబోతున్న రాకెట్‌ శకలం అంత పెద్దదీ కాదు.. అక్కడ రాక్షసబల్లి కాదు కదా.. చిన్న చీమ లాంటి జీవి కూడా లేదు. కాబట్టి మనిషికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ... ఈ ఘటన మనకు ఒక అవకాశాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో ఇదే చందమామపై బోలెడన్ని స్థావరాలు కట్టేçసుకోవాలనుకుంటున్న మనిషి... కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తోంది. ఇప్పుడు వివరాల్లోకి వద్దాం... స్పేస్‌ ఎక్స్‌ గురించి మీకు తెలుసు కదా.. ఈ కంపెనీ గత ఏడాది చంద్రుడిపైకి ఒక రాకెట్‌ను ప్రయోగించింది. 

రెండు ల్యాండర్లను జాబిల్లిపైకి పంపాలన్న ఈ ప్రాజెక్టు విజయవంతమైంది కానీ... వాడేసిన ఒక భాగం మాత్రం కొంచెం దూరంలో తిరుగుతూ ఉంది. అస్థిర కక్ష్యలో వదిలేసిన కారణంగా అది నెమ్మదిగా జాబిల్లివైపు వెళుతోంది. భూమికి తిరిగి వచ్చేందుకు లేదా అంతరిక్షంలోకి వెళ్లిపోయేందుకు ఇంధనం లేదు దీంట్లో. ఫలితంగా చంద్రుడి ఆకర్షణ శక్తి ప్రభావంతో ఆగస్టు ఐదవ తేదీ గంటకు 8700 కిలోమీటర్ల వేగంతో పడిపోనుంది. 

ఈ ధాటికి సుమారు 60 నుంచి 70 అడుగుల భారీ గుంత పడనుంది. చంద్రుడిపైని మట్టి (రెగోలిథ్‌) కొన్ని కిలోమీటర్ల ఎత్తువరకూ చిమ్మనుంది. అంతే. భూమికి కానీ... మన వ్యోమగాములకు గానీ.. కక్ష్యలో తిరుగుతున్న ఇతర ఉపగ్రహాలకు కానీ ఎలాంటి నష్టమూ లేదు. కానీ... జాబిల్లి ఎవరిది? తెలిసికానీ.. తెలియకుండా కానీ దాని రూపురేఖలను మార్చే హక్కు మనిషికి ఉందా? అన్నది కీలకం కానుందని అంతర్జాతీయ అంతరిక్ష నిపుణులు అంటున్నారు. 

జాబిల్లిపై రాకెట్‌ శకలం కూలిపోవడం ఒక అరుదైన ఘట్టమే. రాకెట్‌ సైజు, వేగం, ఎక్కడ పడుతోంది? అన్న సమాచారం మనకు ఎలాగూ తెలుసు కాబట్టి... భారీ శకలాలు ఢీకొన్నప్పుడు ఎలా కంతలు పడతాయి అన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడవచ్చు. అయితే మన భూమి మాదిరి జాబిల్లిపై వాతావరణం లేదు. గాలి కూడా ఉండదు. అందుకే అప్పుడెప్పుడో 1969లో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆ్రల్డిన్‌లు వేసిన అడుగుల జాడలు ఇప్పటికీ చెదరకుండా ఉన్నాయి.

 స్పేస్‌–ఎక్స్‌ రాకెట్‌ శకలం మాదిరి ఏవేవో వచ్చి జాబిల్లిపై కూలిపోతూంటే.. ఇలాంటి వారసత్వ చిహ్నాలు కనుమరుగవుతాయని.. లేదంటే ఇప్పటికే జాబిల్లిపై ఉన్న సైంటిఫిక్‌ పరికరాలను ధ్వంసం చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతరిక్షం మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఏ దేశం కూడా దీన్ని తమదిగా చెప్పుకునే అవకాశం లేకుండా 1967లో అంతర్జాతీయ ఒప్పందం ఒకటి కుదిరింది. 

అయితే ఇందులో జాబిల్లిసహా అంతరిక్షాన్ని ఎలా వాడుకోవాలన్న అంశంపై మార్గదర్శకాలు కానీ.. నియంత్రణలు కానీ లేవు. ఆయా దేశాలు, కంపెనీలదే బాధ్యత. అంటే... ఇప్పుడు స్పేస్‌–ఎక్స్‌ రాకెట్‌తో జరిగే నష్టానికి ఆ కంపెనీ, అమెరికాది బాధ్యతన్నమాట. ఇక్కడే వివాదం మొదలవుతుంది. అందుకే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు జాబిల్లిపైకి జరిపే ప్రయోగాలపై ఒక అంతర్జాతీయ రిజిస్ట్రీ సిద్ధం చేయాలని, ఎవరైనా తప్పు చేస్తే నోటీసులు జారీ చేయాలని, పర్యవేక్షణకు ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఏర్పాట్లు జరగాలని నిపుణులు కోరుతున్నారు.      

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement