అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాలు ఒకవైపు ఏర్పాట్లు చేసుకుంటుంటే, నిన్న మొన్న ప్రారంభమైన అమెరికన్ స్టార్టప్ కంపెనీ ఒకటి అంతరిక్షంలో ఏకంగా లక్ష డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతోంది. ఇందుకోసం ఏఐతో పనిచేసే లక్ష ఉపగ్రహాలను భూనిమ్న కక్ష్యలోకి పంపేందుకు లాస్ ఏంజెలెస్‌కు చెందిన ‘ఆర్బిటాల్’ అనే స్టార్టప్ కంపెనీ అమెరికా ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.
ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే వంద కిలోవాట్ల సామర్థ్యం గల లక్ష డేటా సెంటర్ ఉపగ్రహాలను భూనిమ్న కక్ష్యలోకి పంపనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీ మాదిరిగానే ‘స్టార్‌క్లౌడ్’ అనే మరో స్టార్టప్ కంపెనీ కూడా అంతరిక్షంలో 88వేల డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ అమెరికన్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది.


