నిన్నటి వరకు పెద్దలు చెప్పిన మాటకు పిల్లలు ‘ఓకే’ చెప్పడమే తెలుసు. కానీ, నేడు ఏడేళ్ల పిల్లాడు సైతం ‘నాకు కాస్త స్పేస్ కావాలి’ అంటూ సరిహద్దులు గీస్తున్నాడు. చాట్ జీపీటీని చదివేస్తున్నాడు. ఏఐని ఏలేస్తున్నాడు. యద్ధాలు కాదు, ఉత్తేజమే కావాలంటున్నాడు. ఆకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. రేపటి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 200 కోట్లకు పైగా జనాభాతో అతిపెద్ద తరంగా రికార్డు సృష్టించబోతున్న ఈ ఆల్ఫా జనరేషన్‌ని.. అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే!
కొత్త ఎమోషనల్ వొకాబులరీ
‘నాకు కాస్త ప్రైవసీ కావాలి’ అనే మాట ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తరచూ వినిపిస్తోంది. అలాగని వారు రూడ్‌గానూ ప్రవర్తించడం లేదు, కేవలం ‘నేను మళ్లీ మీతో మాట్లాడటానికి ముందు కాస్త ప్రశాంతంగా ఉండటానికి నాకు కొంత సమయం కావాలి’ అని మాత్రమే చెబుతున్నారు. అంటే వారు తమ భావాలను కొత్తగా ఫీలవడం లేదు. తమ భావాలను స్పష్టంగా, బహిరంగంగా వ్యక్తపరచడానికి వెనుకాడటం లేదు. డిజిటల్ సాంకేతికతతో చిన్నతనం నుంచే ఉన్న పరిచయం వల్ల ఈ తరం పిల్లలకు మరింత స్పష్టమైన, వేగవంతమైన కమ్యూనికేషన్ శైలి అలవడుతోంది.
నేటి తరం అంటే 2010 నుంచి 2025 మధ్య జన్మించిన పిల్లలు తమ ప్రేమను ఎంత స్వేచ్ఛగా వ్యక్తపరుస్తున్నారో; తమకు నచ్చని విషయాలను, అసౌకర్యాలను కూడా అంతే నిర్భయంగా చెబుతున్నారు. వీరినే ‘జెనరేషన్ ఆల్ఫా’గా పిలుస్తున్నారు. వీరు ప్రధానంగా మిలీనియల్స్ (1981–1996), అలాగే కొంతమంది జెన్ జీ (1997–2012) తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతున్నారు. వీరి జీవితాలను శాసిస్తున్న ఉపాధ్యాయులు, అధికారులు మాత్రం ‘జెన్ ఎక్స్’ (1965–1980) తరానికి చెందినవారు.
కొంచెం స్పేస్ కావాలి ప్లీజ్!
⇒ మునుపటి తరాల్లోలా మొహమాటాలకు పోకుండా, చిన్న వయసులోనే ‘నాకు కొంచెం స్పేస్ కావాలి, ‘ట్రిగ్గర్డ్’, ‘బౌండరీస్’, ‘పాజిటివ్ మేనిఫెస్టేషన్‘ వంటి పదాలను అలవోకగా వాడుతున్నారు. తమకు నచ్చని విషయాలను నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. తాము కోరుకునే ప్రశాంతతను ఇవ్వమని నిర్మొహమాటంగా తల్లిదండ్రులకు చెబుతున్నారు.
⇒ అప్పట్లో పెద్దలు ‘నేను చెప్పాను కాబట్టి చెయ్!’ అంటే పిల్లలు ఎదురుప్రశ్న వేసేవారు కాదు. కానీ మిలీనియల్స్ చేతుల్లో పెరుగుతున్న ఇప్పటి తరం íపిల్లలు ప్రతిదానికీ హేతుబద్ధతను కోరుకుంటున్నారు. ‘నేను హోంవర్క్ ఎందుకు ఇప్పుడే చేయాలి?’, ‘నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు నేనెందుకు చూడకూడదు?’ వంటి ప్రశ్నలతో తల్లిదండ్రులను లాక్ చేస్తున్నారు. పెద్దలు ఆదేశాలను గుడ్డిగా పాటించడం కాదు, వాటి వెనుక ఉన్న కారణాలను, స్పష్టతను కోరుకుంటున్నారు.
⇒ ఈ తరానికి చిన్నప్పటి నుంచే టెక్నాలజీతో ఉన్న అనుబంధం వల్ల వారి కమ్యూనికేషన్ శైలి చాలా త్వరగా, సూటిగా మారుతోంది. ప్రతి విషయాన్ని వెరిఫై చేసుకోగలిగే సమాచార విప్లవం మధ్య వీరు పెరుగుతున్నారు. అందుకే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నిస్తున్నారు.
⇒ అయితే, పిల్లలు తాము వాడుతున్న పదాలను పూర్తి క్లినికల్ అర్థంతో వాడటం లేదని, కేవలం తమ భావాలను అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న భాషను వాడుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. కోరుకుంటున్నారు.
అర్థం చేసుకోండి!
1. టైమ్ కోరడం
పిల్లలు అనే మాట: నాకు కాస్త టైమ్ కావాలి.
పెద్దలు అనుకునేది: నన్ను దూరం పెడుతున్నాడు/తిరస్కరిస్తున్నాడు.
అసలు అర్థం: ఇది పెద్దలను దూరం పెట్టడం కాదు. తనను తాను మానసికంగా స్థిమితపరచుకుని, ప్రశాంతంగా తిరిగి మాట్లాడటానికి ఆ చిన్నారి కొద్దిసేపు వ్యవధి కోరుకుంటున్నాడని అర్థం.
2. ఒత్తిడిని వ్యక్తపరచడం
పిల్లలు అనే మాట: నేను చాలా ఓవర్‌వెల్మ్‌డ్‌గా ఫీల్ అవుతున్నాను.
పెద్దలు అనుకునేది: చిన్న విషయానికే అతిగా స్పందిస్తున్నాడు.
అసలు అర్థం: ఒకేసారి చాలా పనులు లేదా విపరీతమైన విషయాలు తన దృష్టి్టని ఆకర్షించి, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని చెప్పే ప్రయత్నం ఇది.
3. నియమాలను ప్రశ్నించడం
పిల్లలు అనే మాట: ‘నేను ఆ పని ఎందుకు చేయాలి?’
పెద్దలు అనుకునేది: ‘నా మాటను ప్రశ్నిస్తోంది.’
అసలు అర్థం: సమాచార ప్రపంచంలో పెరుగుతున్న నేటి పిల్లలు గుడ్డిగా ఆ పనిని చేయకుండా, అందుకు గల కారణాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు.
4. అసౌకర్యాన్ని తెలపడం
పిల్లలు అనే మాట: ‘ఇది నాకు సరిగ్గా అనిపించడం లేదు’
పెద్దలు అనుకునేది: ‘సతాయిస్తున్నాడు/ మొండిగా ప్రవర్తిస్తున్నాడు.’
అసలు అర్థం: ఏదైనా ఒక పరిస్థితి తనకు అన్యాయంగా, శారీరకంగా అసౌకర్యంగా లేదా బాధాకరంగా ఉందని చెప్పడానికి పిల్లలు తమ సరిహద్దులను స్పష్టం చేస్తున్నారు.
5. ఓవర్ స్టిమ్యులేషన్
పిల్లలు అనే మాట: ‘నేను ఓవర్ స్టిమ్యులేట్ అయ్యాను.’
పెద్దలు అనుకునేది: ‘పని తప్పించుకోవడానికి సాకులు వెతుకుతోంది.’
అసలు అర్థం: చుట్టూ ఉన్న రణగొణలు, గందరగోళం లేదా చదువు/సామాజిక ఒత్తిడి తట్టుకోలేనంత తీవ్రంగా మారాయని చెప్పే శారీరక, మానసిక అలసట అది.
6. ట్రిగ్గర్ అవ్వడం
పిల్లలు అనే మాట: ‘ఆ విషయం నన్ను ట్రిగ్గర్ చేసింది.’
పెద్దలు అనుకునేది: ‘ఈ మధ్య సైకాలజీ పదాలను బాగా వాడుతోంది.‘
అసలు అర్థం: ఏదైనా ఒక సంఘటన లేదా మాట వల్ల తనలో ఒక్కసారిగా బలమైన మానసిక ఆందోళన కలిగిందని, దాన్ని నియంత్రించుకోవడానికి తను ఇబ్బంది పడుతోందని అర్థం.
పిల్లల మాటలను కేవలం సాకులుగానో లేదా ఎదురు సమాధానాలుగానో కొట్టిపారేయకుండా, వారి మాటల వెనుక ఉన్న అసలు మానసిక అవసరాన్ని గుర్తించి, ఆదరించడమే దీనికి ఏకైక పరిష్కారం.
ఆర్థిక వ్యవహారాల్లో ముందంజ
జెన్ ఆల్ఫా పిల్లలు డిజిటల్ సాధనాలతో సంపాదనా మార్గాలనూ వెతుకుతున్నారు. కుటుంబ ఆర్థిక నిర్ణయాలను సైతం ప్రభావితం చేస్తున్నారు. చిన్న వయసులోనే స్వయంసమృద్ధిని సాధించడంలోను, సరికొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలోను, పొదుపులోను ఈ తరం మునుపటి తరాల కంటే ఎంతో మెరుగ్గా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
⇒ సుమారు 70 శాతం మంది పిల్లలు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాడుకుంటూ క్రియేటివ్ ప్రాజెక్ట్స్, గేమింగ్, డిజిటల్ స్కిల్స్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు.
⇒ 31 శాతం మంది పిల్లలు తమకు దొరికే పాకెట్ మనీని పొదుపు చేస్తున్నారు.
⇒ సుమారుగా 25 శాతం మంది పిల్లలు ఏదైనా కొనే ముందు ఇప్పటికీ తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటున్నారు.
⇒కేవలం 17 శాతం మంది మాత్రమే అనాలోచితంగా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
⇒ కేవలం 14 శాతం మంది మాత్రమే వీడియో గేమ్స్, ఇన్–యాప్ ఫీచర్స్ లేదా ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం ఖర్చు చేస్తున్నారు.
⇒ దాదాపు 66 శాతం మంది పిల్లలు ఇంట్లోని రోజువారీ ఖర్చులు, వస్తువుల కొనుగోళ్లలో తమ తల్లిదండ్రులకు సలహాలు ఇస్తూ నిర్ణేతలుగా మారుతున్నారు.
డిజిటల్ సవాళ్లు..
⇒ హేతుబద్ధంగా వాస్తవాలను మాట్లాడటంలో, ఏఐ వంటి అధునాతన సాంకేతికతను వాడటంలో జెన్ ఆల్ఫా పిల్లలు తెలివైన వారే అయినా, మరోవైపు వారు తీవ్రమైన మానసిక, శారీరక ఎదుగుదల సమస్యలను ఎదుర్కొంటున్నారు. భావోద్వేగపరమైన చిన్న చిన్న ఇబ్బందులను కూడా పెద్ద సంక్షోభంలా భావించే ధోరణి ప్రదర్శిస్తున్నారు.
⇒ సాధారణంగా మూడు నుంచి ఆరేళ్ల వయస్సు గల పిల్లలు సొంతంగా ఆలోచించడం, సృజనాత్మకంగా ఆడటం నేర్చుకుంటారు. అయితే, నిరంతరం స్మార్ట్‌ఫోన్‌లకు పరిమితం కావడం వల్ల వారిలో సామాజిక నైపుణ్యాలు లోపించి, బంధాలను ఏర్పరచుకోవడంలో వెనుకబడుతున్నారు.
⇒ స్మార్ట్‌ఫోన్‌ల మితిమీరిన వాడకం వల్ల జెన్ ఆల్ఫా పిల్లల్లో ఏకాగ్రత దారుణంగా పడిపోతోంది. సొంత ఆలోచనా శక్తి, విమర్శనాత్మక పరిశీలన దెబ్బతింటున్నాయి. అలాగే, ఆటో–కరెక్ట్ ఫీచర్ల వల్ల సొంతంగా స్పెల్లింగులు రాయలేకపోతున్నారు. పుస్తకాలు చదవడం మానేసి, డిజిటల్ పదజాలానికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా వీరిలో భాషా నైపుణ్యాలు లోపిస్తున్నాయి.
⇒ సోషల్ మీడియాలో చూసే అంశాల వల్ల, తమకు దక్కని లగ్జరీల వల్ల వీరు చిన్న వయసులోనే తీవ్రమైన ‘యాంగై్జటీ’కి లోనవుతున్నారు. మునుపటి తరాల్లాగా ఓటమిని తట్టుకునే శక్తి వీరిలో ఉండటం లేదని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతున్నారు.
⇒ నిరంతర సోషల్ మీడియా పోలికలు, తల్లిదండ్రుల మితిమీరిన జోక్యం, ప్రపంచ పరిణామాల గురించి సమాచార దాడి వంటి ఒత్తిళ్లను వీరు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న మానసిక ఇబ్బందులను కూడా పెద్ద సంక్షోభాలుగా మార్చుకోవడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగి, సొంతంగా సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు.
ఆరోగ్యం అంతంతే!
⇒ ముందు తరాలతో పోలిస్తే జెన్ ఆల్ఫా పిల్లల ఆరోగ్యం ఎంతో సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా కరోనా తరువాత పిల్లల్లో పూర్తిగా శారీరక శ్రమ లోపించడం, పాఠశాలల్లో ప్లే గ్రౌండ్‌లు లేకపోవడం వంటివి వారిని సున్నితంగా మార్చేస్తున్నాయి. ఈ జీవనశైలి వల్ల చిన్న వయసులోనే పిల్లలు ప్రీ–డయాబెటిక్, ఒబెసిటీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో పిల్లల్లో పోషకాహార లోపం ఒక సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు మితిమీరిన ఆహారం, నాణ్యత లేని ఆహారం పెద్ద సమస్యగా మారింది. తల్లిదండ్రుల కొనుగోలు శక్తి పెరగడం, మార్కెట్లో ‘రెడీ–టు–ఈట్’ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ విరివిగా లభించడమే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల జెన్ ఆల్ఫా పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది.
⇒ డిజిటల్ గాడ్జెట్ల వ్యసనం వల్ల పిల్లల్లో ప్రధానంగా కంటి సమస్యలు వస్తున్నాయి. ఇది వారి నిద్ర నాణ్యతను, చదువును కూడా దెబ్బతీస్తోంది. అలాగే గంటల తరబడి కూర్చోవడం లేదా పడుకుని మొబైల్స్ వాడటం వల్ల పిల్లల్లో మెడనొప్పి, వెన్నునొప్పి మామూలైపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఐదు పదేళ్లలో ఈ పిల్లలు తీవ్రమైన వెన్నెముక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
జెన్ ఆల్ఫా.. టీచర్లకు సవాల్!
ఏఐ ప్రపంచంలో జన్మించిన జెన్ ఆల్ఫా– మునుపటి తరాల కంటే భిన్నమైన అంచనాలు, నైపుణ్యాలు, సవాళ్లతో తరగతి గదుల్లోకి అడుగుపెడుతోంది. వీరు పుట్టిందే మొదలు ఏఐ ఆధారిత పరికరాలతో సంభాషిస్తున్నారు. అక్షరాలు నేర్వడానికి ముందే ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. అందుకే వీరు తక్షణ ఫీడ్‌బ్యాక్, ఇంటరాక్టివ్ కంటెంట్, మల్టీమోడల్ లెర్నింగ్ వాతావరణాన్ని కోరుకుంటున్నారు.
అలా జెన్ ఆల్ఫా విద్యావ్యవస్థలో బోధనా పద్ధతులు, సిలబస్ రూపకల్పన, విద్యా సాంకేతికత వినియోగంలో వ్యవస్థాగత మార్పులకు కారణమవుతున్నారు. ప్రాజెక్ట్–ఆధారిత అభ్యాసం, గేమిఫికేషన్, పరిశోధనాత్మక బోధన వంటి క్రియాశీల అభ్యాస వ్యూహాలు ఈ తరానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. విద్యా రంగ పరిణామ క్రమంలో జెనరేషన్ ఆల్ఫా రాక టీచర్లకు ఒక సవాలు. అదే సమయంలో ఒక గొప్ప అవకాశం కూడా!
కొత్తా కాదు.. వింతా కాదు.. మామూలే!
⇒ ఈ తరం పిల్లలకు ఐప్యాడ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఏఐ లేని ప్రపంచం తెలియదు. వీరు మాట్లాడటం నేర్చుకోవడానికి ముందే యూట్యూబ్‌లో వీడియోలు స్క్రోల్ చేయడం, అలెక్సా లేదా సిరితో మాట్లాడటం నేర్చుకుంటున్నారు.
⇒ సామాజిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ప్రపంచ చరిత్రలోనే అత్యధిక జనాభా కలిగిన తరంగా ‘జెన్ ఆల్ఫా’ రికార్డు çసృష్టించబోతోంది. వీరి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా చేరనుంది.
⇒ ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యాప్ లాంచ్ అయిన 2010 సంవత్సరంలోనే ఈ ‘జెన్ ఆల్ఫా’ తరం కూడా ప్రారంభమైంది.
⇒ కోవిడ్–19 మహమ్మారి సమయంలో వీరు చిన్న పిల్లలు కావడం వల్ల, క్లాస్‌రూమ్ కంటే ముందే జూమ్ క్లాసులు, ఆన్‌లైన్ లెర్నింగ్ స్క్రీన్లకు అలవాటు పడ్డారు.
⇒ చాట్ జీపీటీ వంటి టూల్స్ అందుబాటులోకి వచ్చిన కాలంలో వీరు పెరుగుతున్నారు. కాబట్టి హోంవర్క్ చేయడం నుంచి కోడింగ్ నేర్చుకోవడం వరకు వీరు ఏఐని ఒక సాధారణ వస్తువులా వాడుకుంటున్నారు.
⇒ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వాడటం వల్ల వీరు చిన్న వయసులోనే వర్చువల్ కరెన్సీల గురించి తెలుసు కుంటున్నారు. మునుపటి తరాల కంటే వీరు డిజిటల్ లావాదేవీల పట్ల ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు.
⇒ సవాళ్లు ఎన్ని ఉన్నా, జెన్ ఆల్ఫాలో ఒక ప్రత్యేకమైన సానుకూలత ఉంది. సాంకేతికతతో పెరగడం వల్ల వారి డిజిటల్ నాలెడ్జ్ అత్యద్భుతంగా ఉంది. కొత్త విషయాలను నేర్చుకునే తపన ఎక్కువగా ఉంది. అయితే, ఈ సాంకేతికత వారి పాలిట శాపంగా మారకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకూడదు. పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రిస్తూ, వారిని డిజిటల్ వినియోగదారులుగా కాకుండా, క్రియేటర్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది.
షాపింగ్ శైలిలోనూ మార్పు!
జెన్ ఆల్ఫా తరం బ్రాండ్ల కంటే ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. టీవీ అడ్వర్టైజ్‌మెంట్లు చూసో, లేక షాపింగ్ మాల్స్‌కు వెళ్లో వస్తువులు కొనే రోజులకు స్వస్తి పలికింది. వీరు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా రివ్యూల ఆధారంగానే షాపింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వస్తువు ప్యాకేజింగ్ లేదా అందాన్ని చూసి మోసపోవడం లేదు.
⇒ 42% మంది ఒక బ్రాండ్‌కు కట్టుబడి ఉండకుండా, అంతకంటే మెరుగైన ఫీచర్లు ఉన్న వేరే కొత్త బ్రాండ్ దొరికితే వెంటనే మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.
⇒ 72% మంది ఆహారం, పానీయాలు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు.
⇒ 57% మంది ఆటబొమ్మలను ఆన్‌లైన్‌లో కొంటున్నారు.
⇒ 55% మంది దుస్తుల కొనుగోళ్లకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లనే వాడుతున్నారు.
నిఘా తప్పనిసరి!
ఈతరం పిల్లలను పెంచడం నేటి తల్లిదండ్రులకు సవాలుగా మారింది. గత తరాల పెంపకానికి, ఇప్పటి పరిస్థితులకు అస్సలు పోలికే లేకుండా పోయింది.
⇒ జెన్ ఆల్ఫా పిల్లలకు ఇంటర్నెట్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా వంటివి నిత్యావసరాలుగా మారిపోయాయి. ఇది వారి సృజనాత్మకతను పెంచుతున్నా, సమస్యలకూ కారణమవుతోంది. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల డిజిటల్ స్క్రీన్ టైమ్‌పై గట్టి నిఘా ఉంచాలి. ఆన్‌లైన్ భద్రతపై వారికి అవగాహన కల్పించడంతో పాటు, కేవలం గాడ్జెట్స్‌కే పరిమితం కాకుండా శారీరక ఆటలు, పుస్తక పఠనం, వ్యాయామం వైపు వారిని మళ్లించాలి.
⇒ ఈ తరం పిల్లలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామాజిక, పర్యావరణ అంశాలపై చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉంటున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారు. అందువల్ల పేరెంట్స్ పిల్లల ఆలోచనలను తక్కువ చేసి చూడకుండా, వారి అభిప్రాయాలను గౌరవించాలి. వారితో స్నేహపూర్వకంగా మాట్లాడటం ద్వారా జనరేషన్ గ్యాప్‌ను తగ్గించవచ్చు. మన అనుభవాలను వారితో పంచుకుంటూనే, వారి నుంచి సరికొత్త విషయాలను నేర్చుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి.
⇒ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తున్న ఈ కాలంలో భవిష్యత్తులో ఉద్యోగాలు, నైపుణ్యాల స్వరూపమే మారిపోనుంది. ఆర్థిక ఒడిదొడుకులు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ ఈ పిల్లలు ఎదగాల్సి ఉంటుంది. అందువల్ల పిల్లలకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకునే తత్త్వాన్ని, ఓటమిని తట్టుకునే మానసిక ధైర్యాన్ని, సరికొత్త విషయాలను అన్వేషించే జిజ్ఞాసను అలవాటు చేయాలి. వారి కలలను ప్రోత్సహిస్తూ సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా తీర్చిదిద్దాలి.
∙రమా జంబుల


