అసోంలో వరద భీభత్సం: 61కి చేరిన మృతుల సంఖ్య | Assam Floods Death Toll Reaches 61 Amid Widespread Destruction | Sakshi
Sakshi News home page

అసోంలో వరద భీభత్సం: 61కి చేరిన మృతుల సంఖ్య

Jul 25 2026 12:56 PM | Updated on Jul 25 2026 12:59 PM

Assam Floods Death Toll Reaches 61 Amid Widespread Destruction

డిస్పూర్‌: అసోంలో వరద పరిస్థితి అత్యంత భీకరంగా మారింది. గడచిన 24 గంటల్లో మరో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఈ ఏడాది వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 61కి చేరింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఏఎస్‌డీఎంఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 7,05,100 మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. చరైదేవ్ జిల్లాలో ఏడుగురు, శివసాగర్‌లో ఆరుగురు, జోర్హాట్‌లో ఒకరు వరద నీటిలో మునిగి మరణించారు. శివసాగర్ జిల్లాలో దాదాపు 3,50,000 మంది వరద బారిన పడగా, ఇది అత్యధికంగా ప్రభావితమైన జిల్లాగా నిలిచింది. చరైదేవ్‌లో 1,90,000 మంది, జోర్హాట్‌లో 1,30,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో సుమారు 856 గ్రామాలు నీటమునిగాయి. 56,606 హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమి దెబ్బతిన్నది.

రవాణా వ్యవస్థ, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిఖౌ, ధన్సిరి, కుషియారా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో 7 జిల్లాల్లో 363 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, 1,15,200 మందికి పైగా బాధితులకు ఆశ్రయం కల్పించారు. ఆర్డీఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సైనిక బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే శివసాగర్, నాజిరా నియోజకవర్గాల్లో ఇంకా వేలాది మందికి సహాయక సామగ్రి అందలేదని, సుమారు 80,000 మందికి ఇంకా సహాయం చేరాల్సి ఉందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement