మహోగ్రంగా బ్రహ్మపుత్ర! | 47 Killed Over 7 Lakh Affected In Assam Floods | Sakshi
Sakshi News home page

మహోగ్రంగా బ్రహ్మపుత్ర!

Jul 25 2026 2:15 AM | Updated on Jul 25 2026 2:15 AM

47 Killed Over 7 Lakh Affected In Assam Floods

దేశంలో అనేక ప్రాంతాలు వాన జాడలేక ఇబ్బంది పడుతుంటే అస్సాం ఎప్పట్లానే వరద నీటిలో తేలియాడుతోంది. బ్రహ్మపుత్ర నది మహోగ్రరూపం దాల్చి విరుచుకుపడటంతో జనావాసాల్లోకి వరద నీరు ప్రవేశించి 9 లక్షలమందికిపైగా జనం ఇళ్లూ వాకిళ్లూ వదిలి పోవాల్సివచ్చింది. ఇంతవరకూ 47 మంది మరణించగా, దాదాపు 25,000 హెక్టార్ల పంట నీట మునిగింది. మొత్తంగా 11 జిల్లాలు వరదలతో దెబ్బతినగా, శివసాగర్, జోర్హాట్, దిబ్రూగఢ్, చారైదేవ్‌ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హిమాలయా ల్లోని కైలాసశిఖరిలో పుట్టి, ప్రపంచంలోని అతి ఎత్తయిన ప్రాంతంలో పెను వేగంతో ప్రవహిస్తూ అటు తర్వాత అస్సాం మైదాన ప్రాంతాలకు ఆ నది చేరుతుంది. అక్కడ వేగం తగ్గినా అప్పటికే అది ఒండ్రుమట్టినీ, బురదనూ పోగేసుకొస్తుంది. 

ప్రపంచంలోని ఏ నదితో పోల్చినా అది తీసుకొచ్చే ఒండ్రుమట్టి, బురద పరిమాణం చాలా ఎక్కువ. ఇదంతా నదీ ప్రవాహ క్రమంలో ఎక్కడికక్కడ మేటలేస్తూ వస్తుంది. కాలం గడిచేకొద్దీ ప్రవాహమార్గం ఇరుకై ఆ నది దారి మార్చుకోవటం మొదలుపెడుతుంది. అందుకే బ్రహ్మపుత్రను స్థానికులు వలస నది అంటారు. ఎగువ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు ఒక్కసారిగా విరుచుకుపడటం పర్యవసానంగా కుంభవృష్టి, మంచు పర్వతాలు కరిగి పోవటం, భారీ వర్షాలు పడటం అస్సాంకు రివాజు.  ఈసారి మేఘాలయ తదితరప్రాంతాల్లో పడిన భారీవర్షాలు వరదలకు కారణమయ్యాయి.  

బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతం దేశాలూ, రాష్ట్రాలూ దాటి విస్తరించివుంది. ఇది ప్రకృతి శాపమని, ఇందులో మనిషి నిమిత్తమాత్రుడని చెప్పే మాటల్లో నిజం లేదు. వేరే దేశాల సంగతి వదిలి, కనీసం నదీపరివాహ రాష్ట్రాలన్నీ కలసికట్టుగా దృష్టి పెడితే బ్రహ్మపుత్ర కలగజేసే నష్టాన్ని పరిమిత స్థాయికి కుదించవచ్చు. ఇందుకు భిన్నంగా దాన్ని కేవలం ఒక రాష్ట్రానికి చెందిన సమస్యగా పరిగణించటమే చివరికి కష్టనష్టాలన్నీ అస్సాం భరించాల్సివస్తోంది. వరదల్ని కట్టడిచేసేందుకు కరకట్టల నిర్మాణమే సరైందని ఆరాష్ట్రం అనుకుంటోంది. దశాబ్దాలుగా వాటిపైనే కేంద్రీకరిస్తోంది. కానీ నదీ గమనం మారినప్పుడల్లా ఈ కరకట్టలు నిరుపయోగమవుతున్నాయి. పూడికతీత ప్రధాన సమస్యగా మారుతున్నప్పుడు బురద నియంత్రణ విషయంలో ఏం చేయాలన్నప్రశ్న రావాలి. 

అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ చెప్పినట్టు ఇది కనీవినీ ఎరుగని ఉత్పాతం. ఆ రాష్ట్రానికి ఏటా వరదలు రివాజే అయినా, ఈసారి ముంచెత్తినంత వరద యాభైయ్యేళ్లలో ఎప్పుడూ లేదు. కానీ సహాయ చర్యలు ఏమంత సజావుగా లేవు. వరద ప్రభావం అధికంగా గల శివసాగర్‌ జిల్లా మొత్తానికి కేవలం 5 బోట్లు మాత్రమే కేటాయించారు. అధికార యంత్రాంగంనుంచి ముందస్తు హెచ్చరికలు లేకపోవటంవల్ల పశువుల్ని రక్షించుకోవటమైనా, తాము సురక్షిత ప్రాంతాలకు తరలడమైనా జనానికి కష్టమై పోయింది. చుట్టూ సముద్రాన్ని తలపించేలా నీరుంటే, అనేకులు పైకప్పులెక్కి నిస్సహా యంగా చూస్తూ ఉండాల్సివచ్చింది. ఆహారం, నీరు అందించటంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించారన్నది స్థానికుల ఆరోపణ. మొత్తం 872 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగి దీవుల్ని తలపిస్తున్నాయంటే ఈ తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తుంది. 

అడవుల పరిరక్షణ, అడవుల పెంపకం వంటివి అత్యంత కీలకమైన ప్రాథమిక రక్షణ కవచాలుగా తోడ్పడతాయి. కేవలం అవి మాత్రమే సంపూర్ణంగా నియంత్రిస్తాయను కోవటం సరైంది కాకపోయినా, నదీ పరివాహ ప్రాంతంలో ఉండే పర్వత శిఖరాల్లో దట్టమైన అడవులుంటే చెట్ల వేళ్లు మట్టిని గట్టిగా పట్టి ఉంచటంవల్ల కొండచరియలు విరగటం, వర్షపు నీటితోపాటు మట్టి కొట్టుకుపోవటం తగ్గుతుంది.  హిమాలయాలు భూకంప ప్రభావిత జోన్‌లో ఉండటంవల్ల ఆ ప్రాంతంలోని కొండలు అత్యంత బలహీనమైన నాణ్యత కలిగిన మట్టి, రాళ్లతో నిండి ఉంటాయి. నదీ తీరం పొడవునా వెదురు, గడ్డి జాతుల మొక్కల పెంపకంవల్ల కోతను అరికట్టడం సాధ్యమవుతుంది. ఎన్ని చేసినా తాత్కాలిక ఉపశమనానికీ, నష్టాన్ని నియంత్రించటానికీ మాత్రమే అవి తోడ్పడ తాయి. మనం చేయాల్సిందల్లా పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడం. దాన్ని విస్మరించి చేసే ఏ చర్య అయినా మెరుగైన ఫలితాన్నివ్వలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement