గువాహటి: ఏకంగా 2.4 కోట్ల ఏళ్ల క్రితంనాటి మొక్కజాతికి చెందిన శిలాజం జాడను అస్సాంలో తాజాగా గుర్తించారు. తిన్సుకియా జిల్లాలోని మాకుమ్ ప్రాంతంలో పురాతన కేవ్రా(పాండనుస్) జాతికి చెందిన మొక్క శిలాజాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ‘‘ఈ జాతి మొక్కలు వాస్తవానికి భూమిపై తొలిసారిగా 8.5 కోట్ల ఏళ్ల క్రితం ఆవిర్భవించాయి.
అస్సాంలో లభించిన శిలాజం వయసు 2.4 కోట్ల సంవత్సరాలు’’అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘అస్సాం ప్రాంతంలోని ప్రాచీన వృక్ష సంపద ఘన చరితకు ఈ శిలాజం తార్కాణంగా నిలుస్తోంది. 8.5 కోట్ల ఏళ్ల చరిత్ర ఉన్న మొక్కజాతికి చెందిన శిలాజం 2.4 కోట్ల ఏళ్ల నుంచి అస్సాంను తన పుట్టింటిగా మార్చుకుంది. ఇలాంటి ఇంకెన్ని పురాతన విశేషాలను ఈ అస్సాం నేల తన గర్భంలో దాచుకుందో’’అని హిమంత వ్యాఖ్యానించారు.


