అసోం ప్రభుత్వం బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నవారికి ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగులు బహుభార్యత్వాన్ని అనుసరిస్తే వారి ఉద్యోగాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. అసోంలో ఎప్పటి నుంచో ఉన్న బహుభార్యత్వం (Polygamy) ఆచారానికి చెక్ పెట్టడానికి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
2026–27 బడ్జెట్‌లో ఫైనాన్స్ మినిస్టర్ జయంత మల్లా బారువా ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. ఇప్పటికే 2025 నవంబరులో అసోం అసెంబ్లీ బహుభార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం బహుభార్యత్వం నేరంగా రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అంతే కాదు ఈ చట్టం కేవలం శిక్షలతోనే ఆగిపోకుండా, బాధిత మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయనుంది. అవసరమైన సందర్భాల్లో ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం మహిళల హక్కులు, గౌరవం కాపాడటం. బహుభార్యత్వం వల్ల కుటుంబ ఆర్థిక సమస్యలు పెరిగి వారి పిల్లల చదువులు, ఆరోగ్యం నిర్లక్ష్యం అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సమాజంలో లింగ సమానత్వం తీసుకురావడమే ఈ చర్య వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా 'ఒకే దేశం–ఒకే చట్టం' చర్చ జరుగుతున్న సమయంలో అసోం తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యేకంగా నిలిచింది. బీజేపీ పాలనలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా అసోం చర్యలను నిశితంగా గమనిస్తున్నాయి.


