దేశంలో సామాన్యుడి వైద్యభారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరంతరం వాడాల్సిన అత్యవసర మందుల ధరలను నియంత్రిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది. మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ), గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 39 కీలక ఔషధాల (న్యూ డ్రగ్ ఫార్ములేషన్స్) రిటైల్ ధరలపై ఎన్‌పీపీఏ గరిష్ఠ పరిమితిని (క్యాపింగ్) విధించింది. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ), 2013 నిబంధనల ప్రకారం ఇటీవల జారీ చేసిన ఈ అధికారిక నోటిఫికేషన్లు తక్షణమే అమలులోకి రానున్నాయి.
కీలక సవరణలు.. ధరల వివరాలు
ఎన్‌పీపీఏ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిత్యం ప్రజలు ఉపయోగించే విటమిన్లు, అత్యవసర ఇంజెక్షన్ల ధరలను ఈ క్రింది విధంగా నిర్ణయించారు:
కాల్షియం, విటమిన్ D3 మాత్రలు: ఎముకల పుష్టికి, విటమిన్‌లోప నివారణకు విస్తృతంగా వాడే ఈ మాత్రల గరిష్ఠ రిటైల్ ధరను అన్ని పన్నులతో కలిపి ఒక టాబ్లెట్‌కు రూ.8.93గా స్థిరీకరించారు.
యాంటీ-రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్: పిచ్చి కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు అత్యవసరంగా ఇచ్చే ఈ ప్రాణరక్షక ఇంజెక్షన్ (150 IU/ml) ధరను రూ.119.48గా సవరించారు.
కార్డియాక్, బీపీ ఔషధాలు: గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించే క్లోపిడోగ్రెల్ + ఆస్పిరిన్ + అటోర్వాస్టాటిన్ క్యాప్సూల్ ధరను ఒక్కోదానికి రూ.6.37గా, హైపర్‌టెన్షన్ చికిత్సకు వాడే అమ్లోడిపైన్ + బైసోప్రోలోల్ + టెల్మిసార్టాన్ టాబ్లెట్ ధరను రూ.14.74గా నిర్ణయించారు.
జీవనశైలి జబ్బుల బాధితులకు ఊరట
భారతదేశంలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇంట్లో వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న కుటుంబాలకు నెలవారీ మందుల బిల్లులు పెద్ద భారంగా మారుతున్నాయి. తాజా నిర్ణయం ద్వారా బీపీ, షుగర్, హెచ్‌ఐవీ, శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ల ఔషధాల ధరలు నియంత్రణలోకి రావడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్‌కు పెద్ద ఊరట లభించనుంది.
ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు


