పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో వరుసగా పెరుగుతూ వచ్చిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. తాజాగా ఒక్కో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.183 మేర తగ్గింపు ప్రకటించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు కొంత ఉపశమనం లభించింది.
ఇటీవల ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా పెరిగాయి. మే నెలలో భారీ పెంపు నమోదు కాగా, జూన్‌లోనూ మరోసారి ధరలు పెరగడంతో వ్యాపార రంగంపై అదనపు భారం పడింది.
తాజాగా పరిస్థితులు కొంత మెరుగుపడటంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.3,113.50గా ఉన్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,930కు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో ధరల సవరణ అమలులోకి వచ్చింది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. దేశీయ ఉత్పత్తి మెరుగుపడటం, దిగుమతి ఎల్పీజీ కార్గోల రాక ప్రారంభం కావడంతో సరఫరా పరిస్థితులు స్థిరపడుతున్నాయి. దీంతో గతంలో విధించిన కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పరిమితులను పూర్తిగా తొలగించి, యుద్ధానికి ముందు స్థాయికి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపింది.
సంక్షోభ సమయంలో భారీగా ప్రభావితమైన సరఫరా వ్యవస్థను క్రమంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దశలవారీ చర్యలు తీసుకుంది. ప్రారంభంలో 50 శాతం స్థాయికి పడిపోయిన బల్క్ ఎల్పీజీ సరఫరా ఇప్పుడు మళ్లీ 70 శాతం వరకు చేరిందని అధికారులు తెలిపారు. అలాగే రిఫైనరీలను ఎక్కువగా ఎల్పీజీ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా దేశీయ సరఫరాను పెంచారు.
ఈ తగ్గింపు కేవలం కమర్షియల్ వినియోగానికి మాత్రమే వర్తిస్తుంది. గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 40,000 టన్నుల కంటే ఎక్కువగా నిలబెట్టేలా చర్యలు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రధాన నగరాల్లో తాజా కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి:
* ఢిల్లీ: రూ.2,930
* హైదరాబాద్: రూ.3,178
* విజయవాడ: రూ.3,115
ధర తగ్గింపు నేపథ్యంలో హోటల్, రెస్టారెంట్ రంగాలకు కొంత ఊరట లభించినప్పటికీ, గత నెలల పెంపుల ప్రభావం ఇంకా కొనసాగుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.


