చదువుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి వయసు ఎన్నడూ అడ్డంకి కాదని పలువురు నిరూపిస్తున్న ఘట్టాలు చూశాం. అంతేగాదు క్షణికావేశంలో కోరుకున్న కోర్సు చదవలేకపోయామనో, అనుకున్నది సాధించలేకపోయామనో జీవితాలను అంతం చేసుకునే యువతకు కనవిప్పు కలిగించేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి చెన్నైవాసి చేరారు. పైగా ఆయన దివ్యాంగుడు, చక్కగా మరో రంగంలో కెరీర్ నిర్మించుకుని రిటైర్మెంట్ తీసుకునే వయసుకి వచ్చేశారు. అయినా తన చిరకాల కోరికను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ..యువతకు స్ఫూర్తిని రగిల్చారు.
ఆయనే చెన్నైకి చెందిన 51 ఏళ్ల సురేష్ కుమార్. తమిళనాడులోని నాగపట్నం జిల్లా వేలంకన్ని నివాసి అయిన సురేష్ 1992లో 12వ తరగతి పూర్తి చేశారు . అప్పటి నుంచి ఆయనకు మెడిసిన్ చదవాలనే కోరిక ప్రబలంగా ఉండేది. అయితే అప్పట్లో మెడిసిన్ సీటు దక్కించుకోలేకపోయాడు. అదీగా కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఫార్మకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేశాడు. ఆ తర్వాత ఎంబీఏ, రెండు పీహెచ్చ్‌డీలు పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన డయాగ్నోస్టిక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
నీట్‌లో సీటు సాధించాడు ఇలా..
2022లో, సుప్రీంకోర్టు మెడికల్ అడ్మిషన్ల వయోపరిమితిని తొలగించిన తర్వాత కుమార్ నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యాడు. కానీ దానిని చేధించలేకపోయాడు. అయితే 2026లో 18 నెలల ప్రిపరేషన్ తర్వాత మళ్లీ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రయత్నించాడు. ఈసారి 192 మార్కుల సాధించి పీడబ్ల్యూడీ కోటా కింద చెన్నైలో నాగపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించాడు. పూర్తి సమయం పని చేస్తూనే, సురేష్ కుమార్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రిపరేషన్ కొనసాగించాడు.
అతను తరచుగా రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు ప్రిపరేషన్ సాగించినట్లు తెలిపాడు. తనకు అర్థంకానీ జీవశాస్త్రాన్ని కొడుకు అర్థమయ్యేలా బోధించినట్లు వివరించారు. అలాగే గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసి తన ప్రిపరేషన్ సామర్థ్యాన్ని ట్రాక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగానే వైద్య విద్య అభ్యసించాలనే కోరిక మరింత పెరిగిందని అన్నారు. పదవీవిరమణ వయసులో ఇలా కాలేజ్‌కి వెళ్లి చదువుకోవాలన్న తన ఆశయానికి భార్య దుర్గ, కుటుంబం పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పారు. తన భార్య ఉపాధ్యాయురాలని చెప్పారు. ఇక తనకు ఎనిమిది, పది చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుతం తాను తన 72 ఏళ్ల తల్లితో కలిసి జీవించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తనకు సీటు కేటాయించిన మెడికల్ కాలేజ్ ఏడు కి.మీల దూరంలో ఉందని అందుకని సైకిల్‌పై వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించింది. అందులో స్పోర్ట్స్ కేటగిరీ కింద 15 సీట్లు, మాజీ సైనికుల పిల్లలకు 11, పీడబ్ల్యూడీ కేటగిరీ కింద 224, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5% కోటా కింద 614 సీట్లతో ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది.
(చదవండి: పాట పాడినందుకు విధుల నుంచి తొలగించారు..! ఇవాళ ఏకంగా..)


