‘వాయిదాల’ పార్లమెంటు! | Sakshi Editorial On NEET question paper leake | Sakshi
Sakshi News home page

‘వాయిదాల’ పార్లమెంటు!

Aug 14 2026 12:57 AM | Updated on Aug 14 2026 12:57 AM

Sakshi Editorial On NEET question paper leake

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారైనప్పుడు నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ ఉదంతం ఈ స్థాయిలో సభను ముంచెత్తుతుందనీ, వరస గందరగోళ దృశ్యాలతో మొత్తం కార్యకలాపాలే స్తంభించిపోతాయనీ, వాయిదాలతోనే గడిచిపోతుందనీ ఎవరూ ఊహించి వుండరు. నిరవధిక వాయిదా అనంతరం సమావేశాల తీరుతెన్నులెలా ఉన్నాయో చెప్పటం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వంతు. ఆ శాఖను నిర్వహిస్తున్న కిరణ్‌ రిజిజు లోక్‌సభ 19 శాతం, రాజ్యసభ 39 శాతం కాలాన్ని వినియోగించుకో గలిగాయని ప్రకటించారు. ఇలా జరగటం కొత్తేమీ కాదు. చట్టసభలు నిర్దేశించుకున్న లక్ష్యానికీ, సాధించిన ఫలితానికీ పొంతన లేకపోవటం మనకు రివాజే. దీనికి భిన్నంగా మన పార్లమెంటు సక్రమంగా పనిచేసిందంటే, సంతృప్తికరంగా చర్చలు సాగాయంటే ఆశ్చర్యపడాలి. యూపీఏ హయాంలో 2010లో పార్లమెంటు శీతాకాల సమావేశాల వ్యవధిలో కేవలం 5 శాతం మాత్రమే పనిచేసింది. 

రాజ్యసభ అయితే కేవలం 2 శాతం! ఆ రికార్డును అధిగమించిన సమావేశాలు ఇంతవరకూ లేకపోవటం జనం అదృష్టం. సమావేశాల కాలానికి ఎప్పుడూ ఏదో సమస్య ఊడిపడటం, అధికార విపక్షాలు పరస్పర కలహాలు తప్పడంలేదు. ఇలా వాయిదాల పరంపరతో ప్రభుత్వ పక్షం కీలకమని భావించిన బిల్లుల్ని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకోవటం అసలు సమస్య. యూపీఏ హయాంలో లోక్‌సభలో 20 బిల్లులపై కేవలం అయిదంటే అయిదే నిమిషాలు చర్చ జరిగింది. ప్రజల తలరాతల్ని నిర్ణయించే అనేక నిర్ణయాలు ఈ తోవన చట్టాలుగా మారుతున్నాయి. ఇందులో లక్షల కోట్ల విలువైన ఆర్థిక బిల్లులు కూడా ఉంటున్నాయి. ప్రశ్నోత్తర సమయం, జీరో అవర్‌ వంటివి కొట్టుకుపోతున్నాయి. క్రమశిక్షణాయుత ప్రవర్తనతో ప్రజల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పెంచాల్సినవారే అందుకు విరుద్ధమైన సందేశం పంపుతున్నారు. విపక్షంలో ఉండగా బీజేపీ ఏం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అలాగే చేయాలనుకుంది. ఈ క్రమంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నది. 

సమావేశాల ఆరంభం రోజున కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన ‘ఛలో పార్లమెంటు’ ఊహించని పరిణామాలకు దారితీసింది. అసలు సమావేశాల్లో సగభాగం దాని చుట్టూనే తిరిగింది. ఆవిర్భవించిన కొన్ని నెలలకే సీజేపీ ఒక అసాధారణ పరిణామానికి కారణం కావటం దాని ప్రత్యేకత. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవినుంచి తప్పుకోవాల్సివచ్చింది. బీజేపీ అధికారంలోకొచ్చిన ఈ పన్నెండేళ్లలోనూ విపక్షాలన్నీ కట్టగట్టుకుని ఒక్కటైనా ఇలా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాయి. టీఎంసీ ఎంపీలు కొందరు బీజేపీలోకి ఫిరాయించటం, ఇండియా కూటమినుంచి డీఎంకే వైదొలగటం విపక్షాలను నైతికంగా దెబ్బతీసే పరిణామాలు. రంగంలో సీజేపీ లేనట్టయితే విపక్షాలు నిస్తేజంగా, నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో పడివుండేవి. తమ ఉద్యమా నికి ప్రధాన విపక్షంగా కాంగ్రెస్‌ తోడ్పాటు అందించకపోయినా జెన్‌ జీ ఆ పార్టీకి చేసిన ఉపకారమిది. సమావేశాల రెండో భాగంలో కాంగ్రెస్‌ కాస్త మేల్కొని ప్రధాని నివాసం ఎదుట ధర్నాకు దిగింది. జెన్‌ జీ ప్రస్తావించని పెల్లెట్ల అంశాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. కోల్పోయిన ప్రతిష్ఠను కొద్దో గొప్పో కాపాడుకునే ప్రయత్నం చేసింది. 

రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తే తప్ప చట్టసభలకు తమ సమస్యలు పట్టబోవన్న అభిప్రాయం జనంలో కలగటం మంచి పరిణామమేనా అన్నది పార్టీలు ఆలోచించుకోవాలి. అది శాంతియుత ఆందోళనా, హింసాత్మకమా అన్న విచక్షణలేకుండా ప్రతి సమస్యనూ పోలీసులే పరిష్కరిస్తారన్న అభిప్రాయంతో ఉంటే ఏమవుతుందో జంతర్‌ మంతర్‌ నిరూపించింది. సమస్యల్ని చూసే కోణంలోనూ పార్టీల ద్వంద్వప్రవృత్తి వెల్లడవుతోంది. ఢిల్లీలో జెన్‌ జీ ఉద్యమంపై మొదట్లో అభాండాలేసిన బీజేపీ, సంఘ్‌ పరివార్‌ సంస్థలు తమ తప్పిదాన్ని గుర్తించాయి. జార్ఖండ్‌ ఆందోళనలో చురుగ్గా పాల్గొంటున్నాయి. మంచిదే. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ అవకతవకలపై మాత్రం ఈ సంస్థలు నోరెత్తవు. సాక్షాత్తూ అభ్యర్థులే  గోడు వినిపిస్తున్నా బుకాయింపులే. ఇలాంటి వైఖరులే పార్టీల నిజాయితీని ప్రశ్నార్థకం చేస్తాయి. మొత్తానికి వర్షాకాల సమావేశాల తీరుతెన్నులపై అన్ని పక్షాలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ పరిస్థితి తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement