జార్ఖండ్‌లో ‘జంతర్‌ మంతర్‌’ | Sakshi Editorial On Unemployed youth, students Protests At Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో ‘జంతర్‌ మంతర్‌’

Aug 11 2026 1:12 AM | Updated on Aug 11 2026 1:12 AM

Sakshi Editorial On Unemployed youth, students Protests At Jharkhand

ఉన్నత చదువులకూ, ఉద్యోగాలకూ పోటీ పరీక్షలు నిర్వహించే ప్రభుత్వాలు వాటిల్లో అవకతవకలు బయపడినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం, విశ్వసనీయ సంస్థలతో దర్యాప్తు చేయించటానికి మొండికేయటం ఈమధ్య కనబడుతున్న వింత ధోరణి. సోమవారం జార్ఖండ్‌లోని రాంచీలో నిరుద్యోగ యువత, విద్యార్థులు ‘అసెంబ్లీ ముట్టడి’ నిర్వహించినప్పుడు చానెళ్లలో కనబడిన దృశ్యాలు విస్తుగొలిపాయి. హఠాత్తుగా చూసినవారికి అది జంతర్‌ మంతరో, జార్ఖండో తెలియని స్థితి ఏర్పడింది. జార్ఖండ్‌లో జేఎంఎం నాయకత్వానగల పాలక కూటమిలో కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కానీ తమ డిమాండ్లు నెరవేరటం కోసం రాంచీలో యువత 16 రోజులుగా పోరాడాల్సి వస్తోంది. ఉద్యమకారుల డిమాండ్లలో 98 శాతం నెరవేర్చామని జార్ఖండ్‌ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. గత నెల 22న ఈ వ్యవహారంలో పదవి నుంచి తప్పుకొన్న జార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(జేపీఎస్సీ) చైర్మన్‌ ఎల్‌. ఖియాంగ్టేను తాజాగా అరెస్టు చేశారు. కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించారు. కానీ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్‌ అయిన సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది.

నిరుద్యోగ యువతతో ముడిపడి ఉన్న సమస్యలపై ప్రభుత్వాల స్పందనెలా ఉంటుందో జంతర్‌ మంతర్‌తోపాటు జార్ఖండ్‌ ఉద్యమం కూడా నిరూపించింది. సర్కారీ కొలువు లభించాలని యువతీయువకులు ఎంతగానో తపిస్తారు. అందుకోసం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి చదువుల్లో మునిగిపోతారు. శిక్షణ కోసం వేలకు వేలు వెచ్చిస్తారు. తీరా ప్రశ్నపత్రం లీకయిందంటే, అయోగ్యులు పైపైకి ఎగబాకారని తెలిస్తే... ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు చెప్పనలవికాని వేదనను అనుభవిస్తారు. వారి కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. లక్షలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఒక పెద్ద కుంభకోణం బయటపడిన వెంటనే చిత్తశుద్ధిగల ప్రభుత్వమైతే సంబంధిత మంత్రి చేత రాజీనామా చేయిస్తుంది. ఆ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్టు చేస్తుంది. పరీక్ష ఫలితాలను రద్దుచేస్తుంది. ఇందుకోసం యువత రోడ్డెక్కాల్సి వచ్చిందంటే పాలకులు సిగ్గుపడాలి. 

తప్పు జరిగిందని తెలిసినా జార్ఖండ్‌ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు డిమాండ్‌ను ఎందుకు తిరస్కరిస్తోంది? అదొక్కటే కాదు... ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై, వేలంపాటలపై సీబీఐతో దర్యాప్తు చేయించడానికి మొండికేస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న నిరసనలపై రౌడీ ఎమ్మెల్యేలతో దాడులు చేయిస్తోంది. ఈ వ్యవహారంలో విద్యామంత్రి లోకేశ్‌ మీడియాతో మాట్లాడటానికి జంకి, ప్రభుత్వాధికారుల్ని ముందుకు తోస్తున్నారు. మరోవైపు చర్చకు సిద్ధమని సవాళ్లు విసురుతున్నారు. సాక్షాత్తూ అభ్యర్థులే తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుంటే... ఇలా బీరాలు పోవడం ఆయన గారికి సిగ్గనిపించడం లేదు. కేంద్రంలో తమ కూటమి ఏలుబడే ఉన్నా, సీబీఐ దర్యాప్తు అనగానే ఏపీ సర్కారు నిలువెల్లా వణుకుతోంది. 

యువత ఉద్యమాల సందర్భంగా రాజకీయ పక్షాల ద్వంద్వవైఖరి తేటతెల్లం అయింది. జంతర్‌ మంతర్‌ ఆందోళనపై ముద్రలేసి, దాన్ని నీరుగార్చాలని చూసిన బీజేపీ చివరాఖరికి తన వైఖరిని మార్చుకుంది. కానీ జార్ఖండ్‌ ఆందోళనలో అది చురుగ్గా పాల్గొంటున్నది. ఢిల్లీ ఉద్యమంలో మౌనప్రేక్షకపాత్ర వహించి ఆఖరి దశలో మేల్కొన్న కాంగ్రెస్‌... జార్ఖండ్‌లో పాలక కూటమిలో ఉంటూ కూడా ప్రభుత్వానికి నచ్చజెప్పలేకపోయింది. పైగా మీ డిమాండ్లేమిటో చెప్పండని పదిరోజులైనాక కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఉద్యమకారుల్ని అడిగారు. ఏపీలో పాలక కూటమిలో ఉన్న బీజేపీ అక్కడి డీఎస్సీ నియా మకాల స్కామ్‌పై నోరెత్తదు. కానీ జార్ఖండ్‌లో మాత్రం నేనున్నానంటూ ముందు కొస్తుంది. ఇవన్నీ యువత గుర్తించరనుకోవటం ఆ పక్షాల తెలివితక్కువతనం. వెంటనే ప్రభుత్వాలు ఉన్నతస్థాయి దర్యాప్తునకు సిద్ధపడి లీకుల వెనకుండే మాఫియాలనూ, వారికి అండదండలందించే బడా నేతలనూ బయటకు లాగాలి. ఇతర వాగ్దానాల సంగ తలావుంచి కనీసం పరీక్షలైనా సక్రమంగా నిర్వహించలేకుంటే యువత క్షమించదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement