ఓహియో : అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక వ్యక్తి తుఫాను దృశ్యాలను వీడియో తీస్తుండగా ఆకాశం నుంచి పిడుగు నేరుగా అతనిపై పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భయానక దృశ్యం కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సన్నిసినాటి నగరానికి సమీపంలోని ఒక గోల్ఫ్ కోర్టులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ తుఫాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో ఒక వ్యక్తి భయానక వాతావరణాన్ని, ఆకాశంలో మెరుస్తున్న మెరుపులను తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత శక్తివంతమైన పిడుగు నేరుగా అతనిపై పడింది. దీంతో ఆ వ్యక్తి క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోయాడు.
One of the craziest videos I've ever seen. Man was struck by lightning while filming a storm on a golf course Friday in Cincinnati, Ohio. He was struck on the arm, but is recovering and tells me he is "unbelievably lucky." Remember, when thunder roars, go indoors! Credit: Chris S… pic.twitter.com/RrwuavQ5oa
— Matt Devitt (@MattDevittWX) August 9, 2026
మామూలుగా పిడుగుపాటుకు గురయ్యే ప్రక్రియ రెప్పపాటు కాలంలో జరుగుతుంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి చేతిపై పిడుగు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అమెరికా వాతావరణ నిపుణుడు మాట్ డెవిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన జీవితంలో చూసిన అత్యంత విస్మయకరమైన వీడియోల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ వ్యక్తి తాను ఎంతో అదృష్టవంతుడినని అన్నారు.
వాతావరణ నిపుణుల హెచ్చరికల ప్రకారం.. ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను సమయంలో చెట్ల కింద గానీ, బహిరంగ మైదానాలలో గానీ ఉండకూడదు. నేషనల్ వెదర్ సర్వీస్ సమాచారం ప్రకారం.. ఉరుములు వచ్చే మేఘాల నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా పిడుగు పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తుఫాను సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు చేరాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జార్ఖండ్‌లో ఉద్రిక్తత: అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులు..


