సింపుల్‌.. ఈ 7 టిప్స్‌ పాటిస్తే వందేళ్లు బతికేయొచ్చు! | 111 Old Grandma Shares 7 Golden Secrets to a Long Healthy Life | Sakshi
Sakshi News home page

సింపుల్‌.. ఈ 7 టిప్స్‌ పాటిస్తే వందేళ్లు బతికేయొచ్చు!

Aug 10 2026 8:35 AM | Updated on Aug 10 2026 9:04 AM

111 Old Grandma Shares 7 Golden Secrets to a Long Healthy Life

మనిషి వందేళ్లు జీవించాలనే కల ఎప్పటినుంచో ఉంది. కానీ మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఆ కల అందరికీ సులభంగా నెరవేరడం లేదు. అయితే ఆరోగ్యంగా, చురుగ్గా శతాధిక వయసు దాటిన ఓ బామ్మ మాత్రం సుదీర్ఘ జీవితానికి పెద్ద పెద్ద రహస్యాలు అవసరం లేదంటోంది. రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లే ఆరోగ్యానికి పునాది అని బంగారు మాట చెబుతోంది.

ఆమె వయసు 111 ఏళ్లు. ఇంకా ఆరోగ్యంగానే ఉంది. ఉత్సాహంగా, చురుగ్గా ఉన్న ఈ బామ్మ జీవన విధానం నెట్టింట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వయసు పెరిగినా.. శరీరాన్ని కదిలిస్తూ ఉండటమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెబుతోంది. అంతేకాదు.. తాను పాటించే ఏడు సూత్రాలే తన దీర్ఘాయుష్షుకు కారణమని చెబుతున్నారు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం, పరిమితంగా ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన మనసుతో జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని ఆమె నమ్మకం.

తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని రుగావో ప్రాంతానికి చెందిన వాంగ్‌ గైయింగ్‌ అనే ఈ బామ్మ సోషల్‌ మీడియాలో ప్రత్యేకంగా నిలిచారు. వందేళ్లు దాటిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతంగా రుగావోకు పేరుంది. ఐదు తరాల కుటుంబంతో కలిసి జీవిస్తున్న వాంగ్‌.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పొలాల్లో పనులకు సాయం చేసేవారు. వేరుశెనగలు, పుచ్చకాయల కోత వంటి పనుల్లో పాల్గొనేవారు.

ప్రస్తుతం వయసు కారణంగా పనులు తగ్గించినా.. ఇంట్లో చిన్న చిన్న పనులు మాత్రం స్వయంగా చేసుకుంటారు. టేబుళ్లు తుడవడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులను వ్యాయామంగా భావిస్తారు. “శరీరం కదులుతూ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది” అనేది ఆమె నమ్మకం.

ఆహారంలోనూ అదే సూత్రం
వాంగ్‌ ఎప్పుడూ కఠినమైన డైట్‌ను పాటించలేదు. అన్ని రకాల ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడమే తన అలవాటు అని చెబుతారు. కుడుములు, ఆవిరితో ఉడికించిన బన్స్‌ వంటి సాధారణ ఆహారాలతో పాటు చేపలు ఆమెకు ఎంతో ఇష్టం. జీర్ణం కావడానికి సులభంగా ఉండటంతో చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఎంత ఇష్టమైన ఆహారమైనా అతిగా తినకూడదనేది ఆమె సూత్రం.

కోపానికి దూరం.. ప్రశాంతతకు దగ్గర
దీర్ఘాయుష్షుకు ఆహారం మాత్రమే కారణం కాదని వాంగ్‌ చెబుతారు. మంచి మనసు, ప్రశాంతమైన ఆలోచనలు కూడా ఎంతో ముఖ్యమని అంటారు. ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలని ఆమెకు ఓ నియమం ఉంది. అది కుటుంబ సభ్యులను అభినందించడం కావచ్చు.. పాత స్నేహితుడికి ఓ మెసేజ్‌ పంపడం కావచ్చు. ఎవరితోనైనా గొడవ జరిగినా ఎక్కువసేపు ఆలోచిస్తూ బాధపడకుండా నిద్రపోతే ఉదయం అంతా సర్దుకుంటుందని ఆమె నమ్మకం.

12 గంటల నిద్ర.. క్రమబద్ధమైన జీవనం
వాంగ్‌ రోజువారీ జీవితం కూడా చాలా క్రమబద్ధంగా ఉంటుంది. రాత్రి 7 గంటలకే నిద్రకు వెళ్లి.. ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తారు. మధ్యాహ్నం ఒకటి లేదా రెండు చిన్న కునుకులు కూడా తీసుకుంటారు. ఆమె జీవన విధానం చూస్తే.. దీర్ఘాయుష్షు కోసం ఖరీదైన పద్ధతులు, ప్రత్యేక మందులు అవసరం లేదని తెలుస్తోంది. శరీరాన్ని చురుగ్గా ఉంచడం, పరిమితంగా తినడం, ప్రశాంతంగా జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేస్తాయని ఈ 111 ఏళ్ల బామ్మ చెబుతోంది. వయసు పెరగడం సహజం.. కానీ ఆరోగ్యంగా, ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించడం మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందేమో!

బామ్మ చెప్పిన జీవన రహస్యాల్లో ప్రధానంగా 7 పాయింట్లు.. 

1. బద్ధకించకూడదు

బద్ధకం ఏ వయసు వాళ్లకైనా మంచిది కాదు. వయసు పెరిగినా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఇంటి పనులు కూడా ఒకరకంగా వ్యాయామమే!.

2. బ్యాలెన్స్డ్‌ ఫుడ్‌

సుదీర్ఘమైన ఆయుషు కోసం కఠినమైన డైట్‌ లాంటి వేవీ అక్కర్లేదు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం.

3.అతిగా తినకూడదు

ఇష్టమైన ఆహారం అయినా మితంగా తీసుకోవాలన్నది ఆమె సూత్రం.

4. సులభంగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాధాన్యం

ఈ తరహా ఆహారం.. ఆరోగ్యానికి మంచివి

5. మంచి మనసుతో జీవించాలి

ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలన్నది ఆమె అలవాటు.

6. కోపం, ఆందోళనకు దూరంగా ఉండాలి

సమస్యలను ఎక్కువగా మదిలో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం.

7. క్రమబద్ధమైన నిద్ర అలవాటు

రాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం.. మధ్యలో విశ్రాంతి తీసుకోవడం. అది ఏడు గంటలా?, 8 గంటలా? అనేది మీ ఇష్టం.

కొసమెరుపు.. 
వాంగ్‌ గైయింగ్‌ నివసించే రుగావో ప్రాంతం దీర్ఘాయుష్షుకు పేరుగాంచింది. అక్కడ 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు గణనీయంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ప్రాంతంలో 672 మంది శతాధికులు (100 ఏళ్లు దాటిన వారు) ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు దీర్ఘాయుష్షుకు కారణాల్లో ఒకటిగా పరిశోధకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement